పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపాను అక్వాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనించిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది నరసాపురంకు 390 కి.మీ, కళింగపట్నంకు 320 కి.మీ, గోపాల్పూర్ 410 కి.మీ, పూరీ 470 కి.మీ, చెన్నై 610 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. రేపు మధ్యాహ్ననికి నరసాపురం- పూరీ మధ్య గోపాల్పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇది అతి తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందటంతో తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని, గరిష్టంగా 110 కిలోమీటర్లకు చేరుకోవచ్చని అంచనా వేశారు.
ముందుగా అక్వాన్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. కానీ సముద్రంలో వాతావరణ పరిస్థితులు, అనిశ్చితి వల్ల తుఫాన్ దిశ మార్చుకుంది. నెల్లూరు నుండి తుని వరకు తీరం దాటుతుందని మొదట వాతావరణశాఖ భావించింది. ఎల్‌నివో పరిస్థితులు కూడా తుఫాను ఏర్పడటానికి లేదా తీవ్రతరం కావడానికి ప్రతికూలం కాదని వాతావరణశాఖ చెబుతోంది. తుఫాను ఒడిశా వైపు మళ్లినప్పటికీ.. ఏపీలోని కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 19వ తేదీన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
నవంబర్ 20వ తేదీన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వస్తున్నారు. కోస్తా తీరం సైక్లోన్‌కు పశ్చిమాన ఉండటంతో భారీ వర్షాలు కురవడానికి ఎక్కువ అవకాశం ఉందని అంటున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి వరకు కూడా గాలుల ప్రభావం ఉంటుందని, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంటకు అత్యధికంగా 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ.. తాజా పరిస్థితిని బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
స్కూళ్లకు సెలవులు
తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో ప్రభుత్వం స్కూల్స్‌కు సెలవులు ప్రకటించింది. 6 జిల్లాల్లో స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలకు మూడు రోజులు సెలవులు ఇచ్చింది. శ్రీకాకుళంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవును ప్రకటించారు. అలాగేా ఈ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ఇచ్చారు.