Headlines

Watch : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. టికెట్ లేకుండా టెర్మినల్-3లోకి చొరబడ్డ వ్యక్తి.. వీడియో వైరల్ !


దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో కలకలం రేగింది. టికెట్ లేకుండా ఓ వ్యక్తి బలవంతంగా టెర్మినల్-3లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బంది వెంటనే స్పందించి.. అత్యంత చాకచక్యంగా అతడిని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?

బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో టెర్మినల్-3 డిపార్చర్ గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ఒక్కసారిగా భద్రతా సిబ్బందిని తోసుకుంటూ టెర్మినల్ లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే సిబ్బంది రికాకి అయ్యి అతడిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన 25 సెకన్ల వీడియోను సీఐఎస్ఎఫ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంది. తమ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా, వేగంగా స్పందించడం వల్లే ఈ అనూహ్య ఘటనను అడ్డుకోగలిగామని రాసుకొచ్చింది.

ఆ వీడియోలో.. నిందితుడు సెక్యూరిటీ సిబ్బందిని నెట్టుకుంటూ కొన్ని మీటర్ల మేర లోపలికి వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే అప్రమత్తమైన ఒక సీఐఎస్ఎఫ్ జవాన్ అతడిని గట్టిగా పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేశాడు. ఇంతలో మరో సాయుధ జవాన్, క్విక్ రియాక్షన్ టీమ్ (QRT) బృందం అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా సదరు వ్యక్తి వద్ద ఉన్న బ్యాక్‌ప్యాక్‌ను తనిఖీ చేయగా.. కొన్ని గుర్తింపు కార్డులు, స్టడీ సర్టిఫికెట్లు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించినట్టు స్పష్టం చేశారు.

ఇక విమానాశ్రయ భద్రతా నిబంధనల ప్రకారం.. టెర్మినల్ లోపలికి ప్రవేశించాలంటే ప్రయాణికులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే విమాన టికెట్లు, గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. విమానాశ్రయ సిబ్బందికి కూడా ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నిత్యం వేలాది మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించే ఢిల్లీ ఎయిర్‌పోర్టును ఇప్పటికే ‘హైపర్ సెన్సిటివ్’ (అత్యంత సున్నితమైన) ప్రాంతంగా గుర్తించిన విషయం తెలిసిందే.

సీఐఎస్ఎఫ్ పోస్ట్ చేసిన వీడియో..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *