Headlines

Hyderabad: పెళ్లయిన నెల రోజులకే విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కూలిన చెట్టు!


హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై ఎండిపోయిన భారీ వృక్షం ఒక్కసారిగా కూలిపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెళ్లయి నాలుగు నెలలు కూడా గడవకముందే ఈ విషాదం జరగడంతో కుటుంబంలో తీరని శోకం నెలకొంది. నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన వి.సాయికుమార్ (29) హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గత నాలుగు నెలలుగా నాగోలు సమీపంలోని శ్రీవెంకటేశ్వర కాలనీలో అద్దెకు ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. నెల రోజుల క్రితమే ఆయనకు వివాహమైంది. బుధవారం సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో సొంత పని నిమిత్తం ఓ బంధువుతో కలిసి బైక్‌పై బయలుదేరారు. రేడియల్ రోడ్డు మీదుగా తట్టిఅన్నారం, గౌరెల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కుంట్లూరులోని జాన్సన్ స్కూల్ దాటి రాజీవ్ గృహకల్ప సమీపానికి చేరుకున్నారు.

అదే సమయంలో రోడ్డు పక్కన పూర్తిగా ఎండిపోయిన భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలి బైక్‌పై ప్రయాణిస్తున్న సాయికుమార్‌పై పడింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెనుక సీటులో కూర్చున్న ఆయన బంధువు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ప్రమాద సమాచారం అందుకున్న నాగోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. భర్త మరణవార్త తెలుసుకున్న సాయికుమార్ భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లయిన కొద్ది రోజులకే భర్తను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *