కావలసిన పదార్థాలు: చింతపండు నిమ్మకాయంత, వంకాయలు పావు కేజీ, టమాటాలు 4, పచ్చిమిర్చి 8, నూనె 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, ఎండుమిర్చి 3, ఆవాలు అర టీస్పూన్, జీలకర్ర అర టీస్పూన్, ఇంగువ పావు టీస్పూన్, మెంతి పొడి అర టీస్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర తరుగు పావు కప్పు, పసుపు అర టీస్పూన్, ఉప్పు రుచికి సరిపడా, తురిమిన బెల్లం 1 టేబుల్ స్పూన్, నీళ్లు 2 కప్పులు, నెయ్యి 1 టీస్పూన్, కరివేపాకు 2 రెమ్మలు.
ముందుగా నిమ్మకాయంత చింతపండును శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పావు కేజీ లేత వంకాయలు, నాలుగు చిన్న టమాటాలు, కారానికి తగినట్లుగా ఆరు నుండి ఎనిమిది పచ్చిమిర్చి తీసుకుని వాటి పైభాగాన కొద్దిగా నూనె రాయాలి. స్టవ్ మీద గ్రిల్ పాన్ పెట్టి వీటిని అన్ని వైపులా తిప్పుతూ మెత్తబడే వరకు బాగా కాల్చుకోవాలి. నూనెలో మగ్గించడం కంటే ఇలా నిప్పులపై కాల్చడం వల్లే పచ్చిపులుసుకు అసలైన స్మోకీ రుచి వస్తుంది. ఇవి చల్లారిన తర్వాత వంకాయలు, టమాటాల పైతొక్కను, తొడిమలను తీసేయాలి.
ఇప్పుడు స్టవ్ మీద తాలింపు గిన్నె పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి. అందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, తుంచిన ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. దింపే ముందు పావు టీస్పూన్ ఇంగువ, అర టీస్పూన్ మెంతి పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
తర్వాత రోట్లో తాలింపులో వేయించిన వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఇందులోనే కాల్చిన పచ్చిమిర్చి, వంకాయలు, టమాటాలు వేసి మెత్తని ముద్దలా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పావు కప్పు కొత్తిమీర, మిగిలిన తాలింపు వేసి చేత్తో బాగా నలపాలి. ఇందులో నానబెట్టుకున్న చింతపండు నుండి తీసిన చిక్కటి పులుసు, దంచుకున్న వంకాయ-టమాటా ముద్ద వేసి బాగా పిసకాలి.
అనంతరం అర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుము, అర లీటరు నీళ్లు పోసి బాగా కలపాలి. చివరగా ఒక టీస్పూన్ నెయ్యిలో రెండు రెమ్మల కరివేపాకు వేయించి పచ్చిపులుసులో కలుపుకుంటే నోరూరించే వంకాయ పచ్చిపులుసు సిద్ధం.




