Headlines

సీఆర్పీఎఫ్ చెక్‌పోస్ట్‌పై దాడికి ముందే భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన దృశ్యాలు!


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవంబర్ 11న సీఆర్పీఎఫ్ చెక్‌పోస్ట్‌పై దాడి జరగడానికి ఒక రోజు ముందే ఉగ్రవాదులు పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. హతమైన ఉగ్రవాది ఉమర్ నిసార్ దార్, లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్ కలిసి సంచరించిన దృశ్యాలు భద్రతా సంస్థలకు లభించాయి. ఈ పరిణామం భద్రతా వర్గాల్లో కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 10న కుల్గాం జిల్లాలోని మీర్ బజార్, అఖ్రాన్, హబ్లిష్, కిలామ్ తదితర ప్రాంతాల్లో ఉమర్, లతీఫ్ భట్ సంచరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా, ఇద్దరూ అనుమానాస్పదంగా తిరుగుతూ రెక్కీ నిర్వహించినట్లు వెల్లడైంది. భద్రతా బలగాల కదలికలు, దాడులకు అనువైన ప్రాంతాలను పరిశీలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాడి అనంతరం వారి కదలికలు, పరారైన మార్గాలకు సంబంధించిన దృశ్యాలు కూడా కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

నవంబర్ 11న జరిగిన సీఆర్పీఎఫ్ చెక్‌పోస్ట్ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడి జరిగిన తర్వాత ఉమర్ నిసార్ దార్ ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)లో చేరినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరో కీలక విషయం ఏమిటంటే.. గత ఐదు నుంచి ఆరు నెలలుగా ఉమర్, లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్‌కు ఆశ్రయం, ఇతర సహాయ సహకారాలు అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఉమర్ అదృశ్యమైన తర్వాత అతని కుటుంబ సభ్యులు కుల్గాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత అతని ఉగ్రవాద సంబంధాలు బయటపడ్డాయి.

ఇదిలా ఉండగా సోమవారం కుల్గాంలోని లారూ ప్రాంతంలో భద్రతా దళాలు ఉమర్, లతీఫ్ భట్‌లను గుర్తించి అడ్డుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఉమర్ నిసార్ దార్ హతమయ్యాడు. లతీఫ్ భట్ బుల్లెట్ గాయాలతో అక్కడి నుంచి తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్ కోసం భద్రతా దళాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతని కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో కుల్గాం జిల్లాలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *