Headlines

బాత్‌రూంకు వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు.. తలుపులు పగలగొట్టి చూడగా విగతజీవిగా ఎస్ఐ!


బాత్‌రూంకు వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు.. తలుపులు పగలగొట్టి చూడగా విగతజీవిగా ఎస్ఐ!

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. జర్చా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్ బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. చాలాసేపటి వరకు బాత్రూం నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా ఆమె విగతజీవిగా కనిపించారు.

వివరాల్లోకి వెళ్తే.. మృతురాలిని రష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమె 2023 బ్యాచ్‌కు చెందిన మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్. కాన్పూర్‌కు చెందిన రష్మి ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని జర్చా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో తోటి సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

బాత్రూం తలుపు చాలాసేపటి వరకు తెరుచుకోకపోవడంతో పోలీసు సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా రష్మి మృతదేహం కనిపించింది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమికంగా గుండెపోటు కారణంగా ఆమె మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు డీసీపీ శ్రవణ్ కుమార్ తెలిపారు. అయితే మరణానికి అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.

రష్మి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. వారు వచ్చిన తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కచ్చితమైన కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న యువ మహిళా ఎస్ఐ ఆకస్మిక మరణంతో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *