గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఆరేళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టగా.. మరోవైపు తల్లిదండ్రులు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
దుగ్గిరాలకు చెందిన వేమూరి కిరణ్ కుమార్, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఆరేళ్ల కుమారుడు ప్రభు కిరణ్ ఉన్నారు. దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉండటంతో మూడేళ్లుగా గ్రామంలోనే వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. బాలుడు ప్రతిరోజూ ఉదయం తల్లి వద్ద ఉండి.. సాయంత్రం తండ్రి వద్దకు వెళ్లేవాడు.
అదే విధంగా సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన ప్రభు కిరణ్ బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. బాలుడు తల్లి వద్ద ఉన్నాడని తండ్రి, తండ్రి వద్ద ఉన్నాడని తల్లి భావించడంతో వెంటనే గుర్తించలేకపోయారు.
మంగళవారం ఉదయం బాలుడు పాఠశాలకు రాకపోవడంతో ఉపాధ్యాయుడు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో ఇద్దరూ ఆరా తీయగా.. బాలుడు తల్లి వద్దకుగానీ, తండ్రి వద్దకుగానీ వెళ్లలేదని తేలింది.
దీంతో బాలుడి అదృశ్యంపై తల్లిదండ్రులిద్దరూ ఒకరిపై మరొకరు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని నువ్వే దాచేశావంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రభు కిరణ్ ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు.