Headlines

సిడ్నీ మేయర్‌గా తెలంగాణ మహిళ.. స్ట్రాత్‌ఫీల్డ్ 73వ మేయర్‌గా సంధ్యారెడ్డి


ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని స్ట్రాత్‌ఫీల్డ్ పురపాలక సంఘం మేయర్‌గా తెలంగాణకు చెందిన కర్రి సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) ఎన్నికయ్యారు. ఇప్పటివరకు డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన ఆమె.. తాజాగా స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ 73వ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2028 సెప్టెంబర్‌ వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. మేయర్‌గా ఎన్నికైన సందర్భంగా సంధ్యారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక కమ్యూనిటీకి సేవ చేసే అవకాశం లభించడం గౌరవంతో పాటు గొప్ప బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

ఖైరతాబాద్ నుంచి ఆస్ట్రేలియా వరకు..

హైదరాబాద్‌ ఖైరతాబాద్‌కు చెందిన సంధ్యారెడ్డి.. స్థానిక స్టాన్లీ కళాశాలలో ఇంటర్‌ వరకు విద్యాభ్యాసం చేశారు. అనంతరం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో న్యాయవాద పట్టా పొందారు. 1991లో ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆమె.. అక్కడ ఇమిగ్రేషన్‌ న్యాయవాదిగా స్థిరపడ్డారు. భర్తతో కలిసి స్థానికంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ కమ్యూనిటీకి దగ్గరయ్యారు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి వచ్చిన సంధ్యారెడ్డి.. 2021లో తొలిసారిగా స్ట్రాత్‌ఫీల్డ్‌ కౌన్సిల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2024లో మరోసారి కౌన్సిలర్‌గా విజయం సాధించారు. అంతకుముందు 2023లో డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు.

కౌన్సిల్‌లో తన సేవలు, నాయకత్వ అనుభవంతో ముందుకు సాగిన సంధ్యారెడ్డి.. ఇప్పుడు స్ట్రాత్‌ఫీల్డ్ 73వ మేయర్‌గా ఎన్నికై కొత్త బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణకు చెందిన మహిళ ఆస్ట్రేలియాలోని కీలక స్థానిక సంస్థకు మేయర్‌గా ఎన్నికవడం విశేషంగా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *