తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. వచ్చే నెల 12 నుండి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి వచ్చే అధికమాసం సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కన్యామాసం లో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిపితే, దసరా నవరాత్రుల్లో ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. అయితే, వార్షిక ఉత్సవాలకు భిన్నంగా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్దరథం, ధ్వజావరోహణం వంటి కార్యక్రమాలు ఉండవు.
ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. విశేషమైన గరుడ వాహనసేవ మాత్రం రాత్రి 6.30 నుండి 11.30 గంటల వరకు కన్నులపండువగా జరగనుంది. అయితే తాజాగా ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రోజువారి వాహన సేవల వివరాలను టీటీడీ తాజాగా విడుదల చేసింది. కాబట్టి బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు జరిగే వాహన సేవలు కింది విదంగా ఉన్నాయి.
రోజువారీ వాహన సేవల వివరాలు
అక్టోబరు 11న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహిస్తారు. ఇక
అక్టోబరు 12: ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం ఉంటుంది.
అక్టోబరు 13: ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనం, రాత్రి 7 గంటలకు హంస వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనం ఇవ్వనున్నారు.
అక్టోబరు 14: ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగింపు ఉంటుంది.
అక్టోబరు 15: ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.
అక్టోబరు 16: ఉదయం 8 గంటలకు మోహినీ అవతారంలో శ్రీవారు, సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు అభయమిస్తారు.
అక్టోబరు 17: ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు పుష్పక విమానం, రాత్రి 7 గంటలకు గజ వాహనంపై దర్శనమిస్తారు.
అక్టోబరు 18: ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగింపు ఉంటుంది.
అక్టోబరు 19: ఉదయం 7 గంటలకు స్వర్ణరథోత్సవం (దీనిని మహిళా భక్తులు మాత్రమే లాగుతారు), రాత్రి 7 గంటలకు అశ్వ వాహనంపై దర్శనమిస్తారు.
అక్టోబరు 20: ఉదయం 6 గంటలకు చక్రస్నానం. ఈ వేడుకతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగుస్తాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.