ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యల్లో అమెరికా త్వరలోనే విజయం సాధిస్తుందని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందే ఇరాన్‌పై మరోసారి సైనిక దాడి జరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే, ఆ దాడి ఎప్పుడు జరుగుతుందనే విషయంపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు.
ఆదివారం (సెప్టెంబర్ 27) పీజీఏ టూర్ ప్రెసిడెంట్స్ కప్ సందర్భంగా ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడిన ట్రంప్.. యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. యుద్ధం ప్రారంభానికి ముందు ఉన్న స్థాయికి ధరలు తిరిగి చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించకుండా అడ్డుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ను ప్రస్తావిస్తూ.. ఇరాన్‌పై సైనిక ఒత్తిడితో పాటు ఆర్థిక ఆంక్షలను కూడా అమెరికా కొనసాగిస్తోందన్నారు. అమెరికా ఇప్పటికే సైనికంగా విజయం సాధించిందని, అయినప్పటికీ తమ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇరాన్ ఆర్థిక పరిస్థితిపై కూడా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, ద్రవ్యోల్బణం భారీ స్థాయికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ కరెన్సీ, ఆర్థిక వ్యవస్థ, సైన్యం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అమెరికా వ్యాఖ్యలకు భిన్నమైన వైఖరిని వెల్లడించారు. అమెరికాతో మరోసారి యుద్ధం జరిగితే ఎదుర్కొనేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. భారీ స్థాయి, వినాశకరమైన యుద్ధాన్ని ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందని పేర్కొన్నారు.
అయితే ఇరాన్ యుద్ధానికే పరిమితం కావాలని కోరుకోవడం లేదని అరాఘ్చి స్పష్టం చేశారు. దౌత్యానికి, శాంతి ప్రయత్నాలకు తమ దేశం సిద్ధంగా ఉందన్నారు. జాతీయ ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, స్తంభింపజేసిన ఇరాన్ నిధులు, ఆస్తులను విడుదల చేయడం, చమురు విక్రయాలకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలపై ఇరాన్ తన డిమాండ్లను వెల్లడించింది. జూన్‌లో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణలోనూ ఇవే అంశాలు ఉన్నాయని అరాఘ్చి తెలిపారు. అయితే అనంతరం ఇరుపక్షాల దాడులతో ఆ ఒప్పందం అమలు నిలిచిపోయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రంప్ వైపు నుంచి సైనిక ఒత్తిడి కొనసాగుతుండగా.. ఇరాన్ మాత్రం యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమని చెబుతూనే, దౌత్య మార్గాలకు కూడా అవకాశం ఉందని సంకేతాలు ఇస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..