
వంటింట్లో ప్రతిరోజూ అత్యధికంగా వాడే కూరగాయల్లో టమాటాది ఫస్ట్ ప్లేస్. మార్కెట్ నుంచి ఎంతో తాజాగా తెచ్చుకున్న టమాటాలు రెండు, మూడు రోజులకే మెత్తబడిపోవడం, కుళ్లిపోవడం వంటి సమస్యలను చాలామంది మహిళలు ఎదుర్కొంటుంటారు. అయితే టమాటాలు పాడవడానికి వాటి నాణ్యత కంటే మనం ఇంట్లో నిల్వ చేసే విధానంలో చేసే చిన్న చిన్న పొరపాట్లే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. టమాటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే తప్పనిసరిగా పాటించాల్సిన మూడు ముఖ్యమైన జాగ్రత్తలు గురించి తెలుసుకోవడం ముఖ్యం.
ప్లాస్టిక్ సంచులలో ఎప్పుడూ ఉంచవద్దు
మార్కెట్ నుంచి తెచ్చిన ప్లాస్టిక్ కవర్లలోనే టమాటాలను అలాగే ఉంచే అలవాటు చాలామందికి ఉంటుంది. ప్లాస్టిక్ సంచులలో టమాటాలను ఉంచినప్పుడు లోపల తేమ పేరుకుపోయి, గాలి ప్రసరణ పూర్తిగా నిలిచిపోతుంది. దీని ఫలితంగా టమోటాల తొక్క ముడుచుకుపోవడమే కాకుండా బ్యాక్టీరియా చేరి అతి త్వరగా బూజు పడతాయి. టమాటాలు ఎక్కువ రోజులు గట్టిగా ఉండాలంటే వాటికి నిరంతరం గాలి తగలడం ఎంతో ముఖ్యం. అందుకే ప్లాస్టిక్ కవర్ల నుంచి వాటిని తీసి, గాలి ఆడే బుట్టలు లేదా తెరిచి ఉంచే పాత్రలలో భద్రపరచుకోవాలి.
ఎండ తగిలే చోట పెట్టకండి
కొందరు వంటగది కిటికీల దగ్గర లేదా ఎండ తగిలే ప్రదేశాలలో బుట్టలను ఉంచుతుంటారు. పండిన టమాటాలపై ప్రత్యక్ష సూర్యరశ్మి పడితే, అధిక ఉష్ణోగ్రత వల్ల అవి త్వరగా మెత్తబడిపోతాయి. క్రమంగా వాటిలోని రసం బయటకు కారిపోయి రుచి, నాణ్యత పూర్తిగా దెబ్బతింటాయి. అందుకే బాగా పండిన టమోటాలను ఎల్లప్పుడూ వంటింట్లోని చల్లని, తక్కువ వెలుతురు ఉండే ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది.
ఇతర కూరగాయలతో కలిపి ఉంచొద్దు..
కూరగాయలన్నీ ఒకే బుట్టలో కలిపి సర్దడం సాధారణంగా చేసే మరో పెద్ద తప్పు. టమోటాలు సహజంగా ఇథిలీన్ అనే వాయువును విడుదల చేస్తాయి. ఈ వాయువు పండ్లు, కూరగాయలు పండటానికి ఉపయోగపడుతుంది. అయితే టమాటాలను ఇతర కూరగాయలతో కలిపి ఒకేచోట ఉంచినప్పుడు, ఈ ఇథిలీన్ ప్రభావం వల్ల పక్కనున్న ఇతర కూరగాయలు కూడా అతి త్వరగా ముగ్గిపోయి కుళ్లిపోతాయి. అందుకే టమాటాలను ఆకుకూరలు, ఇతర కూరగాయలకు కాస్త దూరంగా ప్రత్యేక పాత్రలో ఉంచడం ఉత్తమం.