Headlines

ఎన్టీఆర్ నటించిన తొలి ఏ సర్టిఫికెట్ సినిమా.. సెన్సార్ బోర్డుకే షాక్ ఇచ్చిన దర్శకుడు


నటరత్న ఎన్టీఆర్ 1981లో తొమ్మిది చిత్రాల్లో నటించి అప్పట్లో ఒక రికార్డు సృష్టించారు. ఇందులో నాలుగు ద్విపాత్రాభినయ చిత్రాలు ఉండడం విశేషం. అవి ప్రేమ సింహాసనం, గజదొంగ, విశ్వరూపం, కొండవీటి సింహం. వీటిల్లో కొండవీటి సింహం చిత్రం ఇండస్ట్రీ హిట్టుగా నిలిచి, తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ నటనకు విశేష ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా 36 కేంద్రాల్లో డైరెక్టుగా 100 రోజులు పూర్తి చేసుకున్న తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది. అలాగే ఎన్టీఆర్ నటించిన మరో ద్విపాత్రాభినయ చిత్రం గజదొంగ కూడా విజయవంతమైంది. మరో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం సత్యం శివం అద్భుతమైన ఓపెనింగ్స్‌తో విడుదలైంది. తొలి వారం 51 లక్షల రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పినా, భారీ అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల పడింది.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

దాసరి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ద్విపాత్రాభినయ చిత్రం విశ్వరూపం కూడా పెద్దగా ఆడలేదు. అలాగే ప్రేమ సింహాసనం, చిరంజీవి నటించిన ఏకైక ఎన్టీఆర్ చిత్రం తిరుగులేని మనిషి, మహాపురుషుడు, ఎవరు దేవుడు వంటి చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ చిత్రాలన్నిటి మధ్యలో విడుదల అయింది ఎన్టీఆర్ సొంత చిత్రమైన అగ్గిరవ్వ. ఆయన చిత్రాల్లో తొలిసారి ఏ సర్టిఫికెట్ పొందిన సినిమా కూడా ఇదే. అప్పట్లో ఏ సర్టిఫికెట్ అంటే అడల్ట్ మూవీ లేదా చవకబారు సినిమా అనే అభిప్రాయం ఉండేది. అయితే అగ్గిరవ్వ విషయానికి వస్తే, చిత్రంలో హీరో రాము (ఎన్టీఆర్) దుండగులతో పోరాటం చేసే సమయంలో అతన్ని కత్తితో చీరే సన్నివేశంలో హింస ఉందని సెన్సార్ వారు తొలగించాలని దర్శకుడు కే. బాపయ్యకు సూచించారు. లేకపోతే ఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు.

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

అయితే ఈ సన్నివేశం తర్వాత వచ్చే కోర్టు సీన్‌లో ఎన్టీఆర్ తన శరీరం మీద ఉన్న గాయాలను చూపించాల్సి ఉన్నందున, కంటిన్యూటీ పోతుందని భావించిన నిర్మాత ఎన్టీఆర్, దర్శకుడు బాపయ్య కట్ చేయడానికి అంగీకరించలేదు. దాంతో సెన్సార్ వారు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే, ఈ ఏ సర్టిఫికెట్ అభిమానులను నిరుత్సాహపరచకుండా, ఏ సర్టిఫికెట్ అంటే ఏ క్లాస్ యాక్షన్ పిక్చర్, మీ హీరో తొలి ఏ క్లాస్ పిక్చర్ అంటూ చిత్ర బృందం వినూత్నంగా ప్రచారం చేసింది. ఎన్టీఆర్, దర్శకుడు కే. బాపయ్య కాంబినేషన్లో మొత్తం ఆరు చిత్రాలు రాగా, అధిక శాతం విజయం సాధించాయి. అగ్గిరవ్వ ఎన్టీఆర్ సొంత బ్యానర్ లో కే. బాపయ్య పని చేసిన ఏకైక చిత్రం. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రిపాత్రలో జగ్గయ్య, తల్లిగా ఎస్. వరలక్ష్మి నటించారు. కొడుకు రాము పోలీస్ ఆఫీసర్ కావాలన్నది తండ్రి కోరిక కాగా, తల్లి మాత్రం వేరే ఉద్యోగం చేయమని చెబుతుంది. అమ్మ మాట కాదనలేక ఆఫీసులో చేరిన రాము, తర్వాత క్యాంపుకు వెళ్తున్నానని చెప్పి పోలీస్ ట్రైనింగ్ తీసుకుని అధికారి అవుతాడు. ఆ తర్వాత విలన్లు కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, కవితల భరతం పడతాడు. నటి కవిత ఈ సినిమాలో విలన్లలో ఒకరిగా నటించడం విశేషం. మరో పోలీస్ ఆఫీసర్‌గా మోహన్ బాబు, హాస్యనటుడు రాజబాబు కనిపించి అలరించారు. హీరోయిన్ శ్రీదేవి తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గుహనాథన్ అందించిన కథకు గొల్లపూడి సంభాషణలు రాయగా, ఎన్టీఆర్ సొంత చిత్రంలో అన్ని పాటలు ఆత్రేయ రాయడం ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం. ఎన్టీఆర్ తనయుడు మోహన్ కృష్ణ ఈ చిత్రంతోనే తొలిసారిగా కెమెరామెన్ గా పరిచయమయ్యారు. 1981 ఆగస్టు 24న విడుదలైన అగ్గిరవ్వ చిత్రానికి తొలి రోజు నుంచే ఫ్లాప్ టాక్ వచ్చినా, దానికి సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపించింది. చాలా తక్కువ బడ్జెట్‌లో తీయడం వల్ల ఆర్థికంగా విజయం సాధించింది ఈ సినిమా..

ఇవి కూడా చదవండి



స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *