Headlines

భూమి కొనేముందు.. ఈ నిజాలు తెలియకపోతే..నష్టపోతారు!


మీరు ఓ భూమిని కొనాలనుకుంటారు. కానీ అది ఏ రకం భూమో మీకు తెలియదు. ఎందుకంటే.. ఇప్పుడు 22A రచ్చ నడుస్తోంది. దీంతో అది ప్రభుత్వ భూమా లేక.. మరో రకమైన ల్యాండా.. అది కొంటే ఏమైనా లిటిగేషన్ ఉంటుందా అన్న భయం, అనుమానం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అసలు భూములు ఎన్ని రకాలు.. వాటి పేర్లు ఏమిటి.. వాటిని ఎలా గుర్తించాలి అన్న విషయాలపై క్లారిటీ ఉంటే.. ఈ ఆందోళనే అక్కర్లేదు. ఎందుకంటే.. కొన్ని రకాల భూములకు మాత్రమే శాశ్వత హక్కులుంటాయి. కొన్నింటికి.. తాత్కాలిక హక్కులే ఉంటాయి. వీటిపై అందరికీ స్పష్టమైన అవగాహన కచ్చితంగా ఉండాలి. దీనివల్ల ఒక భూమిని కొనే ముందు.. అది ఏ రకమైన ల్యాండ్ అన్నది ముందు సమగ్రంగా పరిశీలించవచ్చు. అప్పుడే దానిపై కంప్లీట్ క్లారిటీ వస్తుంది. దీనివల్ల మోసపోయే అవకాశం ఉండదు. సో.. ల్యాండ్ లో ఏ ఏ రకాలు ఉంటాయో.. వాటిలో వేటి పై, ఏ మేరకు కొనుగోలుదారులకు హక్కులు ఉంటాయో చూద్దాం. ఫస్ట్.. పట్టా భూముల సంగతి చూద్దాం. ఇవి పూర్తిగా ప్రైవేటు యాజమాన్యం చేతుల్లో ఉంటాయి. వీటికి పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉంటుంది. ఈ భూములను అమ్ముకోవచ్చు. కొనుక్కోవచ్చు. అలాగే వారసత్వంగా ఇవ్వచ్చు. భూమిలో కొంత భాగాన్ని పంచవచ్చు. బహుమతిగా ఇవ్వచ్చు. దానం చేయవచ్చు. అలాగే జీపీఏ, ఏజీపీఏ పై భూమి యజమానికి అన్ని హక్కులూ ఉంటాయి. ఈ ల్యాండ్స్.. రెవెన్యూ రికార్డ్స్ లో 1-B రిజిస్టర్ లో నోట్ చేస్తారు. ఇక వక్ఫ్ బోర్డు పర్యవేక్షణలో ఉండే భూములను వక్ఫ్ భూములు అంటారు. వీటిని మసీదుల కోసం కేటాయిస్తారు. అలాగే దర్గాల కోసం, కబరస్థాన్ ల కోసం కూడా ఇస్తారు. ఇవన్నీ వక్ఫ్ బోర్డు పరిధిలోనే ఉంటాయి. దేవాదాయ భూముల గురించి చాలా మంది వినే ఉంటారు. వీటి పేరులోనే ఉంది.. ఇవి దేనికి ఉద్దేశించినవో. దేవాలయాల నిర్వహణ కోసం వీటిని ఉపయోగిస్తారు. అంటే దేవుళ్లు, గుడుల పేరుతో ఉండే ఈ భూములను పూర్తిగా వాటి కోసమే కేటాయిస్తారు. అసైన్డ్ భూమి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. భూమి లేని వారికి, పేదవారికి సాగు చేసుకోవడానికి, అక్కడే నివసించడానికి ప్రభుత్వం ఇచ్చే భూమిని అసైన్డ్ భూమి అంటారు. కాకపోతే దీనిని అమ్మడానికి, కొనడానికి వీలుపడదు. 1977 పీవోటీ చట్టం ప్రకారం ఇది నిషేధం. అంటే కేవలం వారితో పాటు వారి వారసులు మాత్రమే అనుభవించడానికి హక్కు ఉంటుంది. భూదాన్ భూముల గురించి చూద్దాం. వీటినే గ్రామదాన్ భూములు అని కూడా అంటారు. అప్పట్లో భూదానోద్యమం సమయంలో చాలా మంది భూస్వాములు.. తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చారు. తరువాత దీనికి బోర్డును ఏర్పాటు చేశారు. దీని ద్వారా పేదవారికి కొంత భూమిని పంచిపెట్టారు. కానీ ఈ భూములన్నీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి. ఆచార్య వినోబాభావే చేపట్టిన భూదానోద్యమం ఫలితమిది అని చెప్పాలి. ల్యాండ్ సీలింగ్ చట్టం.. అంటే వ్యవసాయ భూముల పరిమితి చట్టం-1973 ద్వారా.. భూస్వాముల నుంచి కొంత భూమిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని మిగులు భూములు, సర్‌ప్లస్ భూములు, సీలింగ్ భూములు అంటారు. అలాంటి భూముల్లో కొంత భాగాన్ని సీలింగ్ పట్టాల రూపంలో పేదలకు ఇచ్చారు. ఇది పోగా మిగిలిన భూమి ప్రభుత్వం వద్ద ఉంది. అయితే.. తరువాతి పరిణామాల్లో భాగంగా.. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని 1976లో తీసుకువచ్చారు. కానీ దానిని 2008లో రద్దు చేసేశారు. ఇనాం భూముల గురించి చూస్తే.. రాజుల కాలం నుంచి బ్రిటిషర్ల వరకు సంస్థానాలు, నవాబులు, జమీందార్లు అందరూ బహుమతిగా ఇచ్చిన భూములివి. 1955 వరకు వీటి లెక్క వేరుగా ఉన్నా.. ఆ ఏడాది ఇనాం చట్టాన్ని రద్దు చేశారు. దీంతో ఈ భూములు ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయి. వీటికి ఓఆర్సీ పొందినవారు.. అంటే ఆధీన ధ్రువీకరణ పత్రాన్ని పొందినవారికి ఆ భూములపై హక్కుంటుంది. అంటే పట్టా భూమికి ఎలాంటి హక్కుంటుందో అలా వీటిపైనా రైట్ ఉంటుంది. ఒకవేళ ఈ హక్కు లేకపోతే.. వారసత్వంగా వీటిని బదిలీ చేసుకోవడానికి మాత్రమే ఛాన్సుంటుంది అని మర్చిపోకూడదు. రెవెన్యూ భూములన్నీ ప్రభుత్వ భూములే. ఇవి రెవెన్యూ శాఖ పరిధిలో ఉంటాయి. దేశానికి సేవ చేసే భాగ్యం అందరికీ రాదు. అలాంటిది.. రక్షణ దళాల్లో పనిచేసినవారు రిటైర్ అయ్యాక వారికి కొంత భూమి కేటాయిస్తారు. అలాగే విధుల్లో వీర మరణం పొందితే.. వారి కుటుంబానికి కొంత భూమి ఇస్తారు. అంటే మాజీ సైనికులు, ఎక్స్-సర్వీస్‌మెన్ కు ఇచ్చే భూమి ఇది. ఈ భూమిని పొందిన తరువాత తొలి పదేళ్లు.. అసైన్డ్ భూములకు ఎలాంటి హక్కులుంటాయో.. వీటికీ అవే వర్తిస్తాయి. ఆ తరువాత సర్కారు నుంచి నిరభ్యంతర పత్రాన్ని తీసుకోవాలి. అప్పుడు ఆ భూమి పై వారికి పూర్తి హక్కు వస్తుంది. పశువుల మేత కోసం కూడా ప్రత్యేకంగా భూములుంటాయి. వీటిని గైరాన్ భూములంటారు. వీటిపై సర్వ హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి. పశువుల మేత కోసం మైదానాలను కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇలాంటి వాటిని బంచరాయి భూములంటారు. వీటిపైనా ప్రభుత్వానికే సర్వహక్కులూ ఉంటాయి. డి-పట్టా భూముల గురించే మీకు తెలిసే ఉంటుంది. వీటినే డీకేటీ ల్యాండ్స్ అని పిలుస్తారు. పేదలు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే.. ప్రభుత్వం వారికి వీటిని ఇస్తుంది. అసైన్డ్ ల్యాండ్స్ పై ఎలాంటి హక్కు ఉంటుందో వీటిపైనా వారికి అలాంటి రైట్ ఉంటుంది. ఉపయోగంలో లేని కొండలు, పడావు భూములు, వాగులు.. ఇలాంటివాటిని బంజరు భూములని, పోరంబోకు భూములని అంటారు. ఇలాంటి ల్యాండ్స్ ను సమాజానికి ఉపయోగపడే వాటికి ప్రభుత్వం కేటాయిస్తుంది. జిరాయితీ ల్యాండ్స్ గురించి తెలుసా.. ఓల్డ్ రెవెన్యూ రికార్డ్స్ లో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఇవి పూర్తిగా ప్రైవేట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అని చెప్పాలి. ఎనిమి ప్రాపర్టీస్ పేరుతో కొన్ని ల్యాండ్స్ ఉంటాయి. చైనా, పాకిస్తాన్ యుద్ధాలతో పాటు దేశ విభజన సమయంలో కొంతమంది వలస వెళ్లిపోయారు. అలాంటి వారి ఆస్తులు.. 1968 ఎనిమీ ప్రాపర్టీస్ చట్టం కింద ఉంటాయి. కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా పరిధిలోనే ఉంటాయి. వీటిని కొనడానికి కాని, అమ్మడానికి కాని వీలుపడదు. ఇక చుక్కల భూముల సంగతి చూద్దాం. RSR.. అంటే రెవెన్యూ రీ సెటిల్‌మెంట్ రిజిస్టర్. దీనిని రెడీ చేసిన టైమ్ లో… ఏవైనా భూములకు యాజమాన్య హక్కు పత్రాలు లేకపోతే.. వాటిని ప్రభుత్వ భూమి అని కాని, ప్రైవేటు భూమి అని కాని నిర్థారించలేదు. అలాంటివాటికి రికార్డుల్లో చుక్కలు పెట్టారు. అందుకే వీటికి ఆ పేరు వచ్చింది. ఇక FTL, బఫర్, శిఖం భూముల గురించి తెలిసే ఉంటుంది. జలాశయాల వెనుక ఉండే వాటిని శిఖం భూములంటారు. జలాశయం చుట్టూ రక్షణ కోసం ఉండేవాటిని బఫర్ ల్యాండ్స్ అంటారు. చెరువులతో పాటు జలాశయాల పూర్తి నీటి మట్టం.. అంటే FTL వరకూ ఉండే ల్యాండ్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రభుత్వానివే. సర్కారుకే యాజమాన్య హక్కులు ఉంటాయి. శివాయి జమేదారి లేదా శివాయి జమాదారి అన్న పేరుతో మరికొన్ని భూములుంటాయి. ఈ ల్యాండ్స్ అన్నీ పూర్తిగా ప్రభుత్వానికే చెందుతాయి. వీటిని సాగుచేసుకునే వారు తాత్కాలికంగా శిస్తు లేదా పన్ను చెల్లిస్తారు. కాని వీటిపై వారికి ఏ హక్కూ ఉండదు. అటవీ భూములు అంటే.. ఈ శాఖ పరిధిలోకి వచ్చే భూములన్నీ దానికే సొంతం. మొత్తం హక్కులు అటవీశాఖకే ఉంటాయి. ఇక ఫారెస్ట్ లో పోడు వ్యవసాయం చేసుకునేవారికి… అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 ప్రకారం హక్కుంటుంది. వాటికి సంబంధించిన పత్రాలను కూడా ఇచ్చారు. వారికి ఇంకే రకమైన హక్కులూ ఉండవు. ఇక భూముల వారసత్వ బదిలీతో పాటు ప్రభుత్వ పథకాలకు వీరికి అర్హత ఉంటుంది. 22-A భూముల సంగతి చూస్తే.. భూసేకరణ చట్టం-2013 ప్రకారం పట్టా భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించి.. ప్రజా అవసరాలకు ఉపయోగిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేస్తాయి. ఇలాంటి ల్యాండ్స్ ను 22-A నిషేధిత జాబితాలో ఉంచుతారు. భూముల్లో ఇన్ని రకాలు ఉంటాయి. అందుకే ల్యాండ్ ని కొనే ముందు అది ఏ రకమైన ల్యాండ్ అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే ఎలాంటి చిక్కులు ఉండవు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!

Depression: ఫేక్‌ నవ్వు వెనుక దాగిన బాధ.. మనసు మాట వినండి బ్రో.. నువ్వు డిప్రెషన్‌ను జయిస్తావు

Pink Power Run 3.0: హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్‌ 3.0కి భారీ స్పందన

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారు మరణిస్తే కుటుంబానికి ఏ ప్రయోజనాలు అందుతాయి? క్లెయిమ్ ప్రక్రియ ఇదే!

Arunachalam: అరుణాచల కొండకు ప్రకృతి చికిత్స.. ఫలిస్తుందా!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *