Headlines

Vijayawada: ఏపీలో భారీ వర్షాలు ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద


ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాకాలంలో సరైన వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. సరిగ్గా పంటపొలాలకు నీరు పెట్టాల్సిన కీలక సమయంలో వాయుగుండం రూపంలో వరుణుడు కరుణించాడంటూ.. కృష్ణా డెల్టా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లోనే తొలిసారిగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో కృష్ణా నదికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాములేరు, వైరా, మున్నేరు, బుడమేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ వరద నీరంతా కృష్ణా నదికి చేరడంతో విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో కృష్ణా డెల్టా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. శుక్రవారం ప్రకాశం బ్యారేజీకి సుమారు 55 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులకు చేరింది. వచ్చిన నీటిలో కొంత భాగాన్ని కృష్ణా డెల్టా కాల్వలకు విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టా ప్రధాన కాల్వకు 5,026 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టా ప్రధాన కాల్వకు 2,519 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్‌కు 259 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే సుమారు 47,125 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. ఇప్పటివరకు నీటి కోసం ఎదురుచూస్తున్న ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలు.. ఇప్పుడు వరద నీటితో కళకళలాడుతున్నాయి. కృష్ణా నదికి భారీగా వరద నీరు రావడంతో పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించే ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఈ వరద మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఇతర ప్రధాన జలాశయాలకు కూడా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం జలాశయానికి కూడా వరద నీరు చేరుతోంది. ఎగువన ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఉప్పొంగడంతో ధవళేశ్వరం వద్ద గోదావరి హోరెత్తుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల పెరగడంతో దిగువన ఉన్న దివిసీమ, కృష్ణా నది పరివాహక లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదిలోకి దిగవద్దని, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కాల్వలకు నీటి విడుదల పెరగడంతో ఖరీఫ్ పంటలకు ఈ నీరు ఎంతో మేలు చేస్తుందని కృష్ణా డెల్టా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో బుడమేరు వాగు ఉగ్రరూపం దాల్చుతోంది. కృష్ణా జిల్లాలోని నందివాడ మండల పరిధిలో బుడమేరు ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వాగు ఉద్ధృతికి వందలాది ఎకరాల్లోని పంట పొలాలు నీట మునిగి తీవ్ర పంట నష్టం వాటిల్లింది. మరోవైపు, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీటితో పాటు కొట్టుకువచ్చిన గుర్రపుడెక్క పుట్టగుంట వంతెన వద్ద పేరుకుపోవడంతో ప్రవాహానికి తీవ్ర అడ్డంకిగా మారింది. నీరు ముందుకు సాగకపోవడంతో ప్రవాహ తీవ్రత మరింత పెరుగుతోంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు ప్రొక్లైనర్ యంత్రాల సహాయంతో వంతెన వద్ద పేరుకుపోయిన గుర్రపుడెక్కను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. వరద మట్టం ఇదే రీతిలో కొనసాగితే గుడివాడ – హనుమాన్ జంక్షన్ మధ్య వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు, పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. జిల్లాలో మొత్తం 217.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. సగటున 7.7 సెంటీమీటర్లుగా రికార్డైంది. ఏలూరు పరిధిలోని ఐదు మండలాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చింతలపూడి మండలంలో 16.2 సెంటీమీటర్లు, అత్యల్పంగా జంగారెడ్డిగూడెంలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా.. ఈ సీజన్‌లో తొలిసారిగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరడంతో కృష్ణా డెల్టాకు జలకళ వచ్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో.. బ్యారేజీకి వచ్చే నీటిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు ఖరీఫ్ పంటలకు అవసరమైన నీరు అందడంతో కృష్ణా డెల్టా రైతుల్లో ఆనందం కనిపిస్తుండగా.. మరోవైపు దిగువ ప్రాంతాలకు నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో దివిసీమ, లంక గ్రామాలు, కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

IPL 2027 వేలం ఇండియాలోనే.. గోవాలో మినీ ఆక్షన్‌!

సాటా ఆధ్వర్యంలో ఘనంగా 96వ సౌదీ నేషనల్ డే వేడుకలు

అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి

గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న వంటనూనె ధరలు

Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *