హాయ్ అండి.. ఇవాళ నిజంగా ఓ గుడ్‌న్యూస్‌తో మీ ముందుకు వచ్చాను. త్వరలో దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి.. ఇటు చూస్తే మార్కెట్లో ఏ వస్తువు చూసినా ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం గురించి మీకు చెప్పబోతున్నాను. ప్రస్తుత కాలంలో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎల్‌నినో ఎఫెక్ట్ కావచ్చు.. ద్రవ్యోల్భణం కావచ్చు.. కారణం ఏదైనా నిత్యం పెరుగుతున్న ధరలతో సామాన్యుడి బ్రతుకుబండి భారంగా నడుస్తోంది. వంటల్లో ఉపయోగించే ఉల్లి నుంచి వంట నూనె వరకూ, పప్పులు నుంచి కూరగాయల వరకూ.. ధరలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. మార్కెట్‌కు వెళ్తే ఏ వస్తువు ముట్టుకున్నా మంట పుడుతోంది. ధరలు విపరీతంగా పెరిగిపోయి నెలాఖరు వచ్చేసరికి సామాన్య, మధ్యతరగతి ప్రజల కుటుంబ బడ్జెట్ తలకిందులై, ఆదాయం చాలక వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా వంటగదిలో రోజువారీ వంటకాలకు అత్యంత కీలకమైన వంటనూనెల ధరలు గత కొంతకాలంగా ఆకాశాన్ని తాకడంతో గృహిణులు తీవ్ర ఆందోళన చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో, రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి తీపి కబురు అందించింది. పెరిగిన ధరల భారం నుంచి ప్రజలకు ఊరట కలిగిస్తూ వంటనూనెలపై దిగుమతి సుంకాలను భారీగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్లో పెరుగుతున్న వంటనూనెల ధరలను అదుపులోకి తీసుకురావడమే లక్ష్యంగా సన్‌ఫ్లవర్, సోయాబీన్, పామాయిల్లకు సంబంధించిన ముడి , రిఫైన్డ్ రకాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్నితగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సవరించిన నిబంధనలు తక్షణమే.. అంటే సెప్టెంబరు 24 నుంచే అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో వంటనూనెల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే..ఏ నూనెపై ఎంత పన్ను తగ్గింది? అనేది ఇప్పుడు చూద్దాం.. వినియోగదారులు నిత్యం ఎక్కువగా ఉపయోగించే పొద్దుతిరుగుడు నూనెపై ప్రభుత్వం అత్యంత భారీగా సుంకాన్ని తగ్గించింది. క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి ఏకంగా సున్నాకు కుదించారు. అంటే ఇకపై దీనిపై ఎలాంటి ప్రాథమిక పన్ను ఉండదు. ఇక రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ నూనె పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 32.5 శాతం నుంచి ఏకంగా 22.5 శాతానికి అంటే 10 శాతం మేర తగ్గించారు. అదేవిధంగా ఇతర ముఖ్యమైన నూనెలపై కూడా పన్నుల కోత విధించారు. ముడి సోయాబీన్, పాపాయిల్ పై ఉన్న 10 శాతం సుంకాన్ని 5 శాతానికి తగ్గించారు. రిఫైన్డ్ సోయాబీన్, పామాయిల్ పై ఉన్న 32.5 శాతం పన్నును 27.5 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు, దేశీయ అవసరాలను బేరీజు వేసుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల నూనెల దిగుమతి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. దిగుమతి సుంకాలు తగ్గడం వల్ల మార్కెట్లో వంటనూనెల లభ్యత పెరిగి, రాబోయే విజయదశమి, దీపావళి వంటి ప్రధాన పండుగల సమయంలో లీటరు నూనెపై చెప్పుకోదగ్గ స్థాయిలో ధర తగ్గే అవకాశం ఉంది. నిత్యం పెరిగే ధరలతో సతమతమవుతున్న పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిర్ణయం ఆర్థికంగా కొంత వెసులుబాటును, శాంతిని కలిగిస్తుంది. కుటుంబ బడ్జెట్లో నూనె ఖర్చు తగ్గడం వల్ల సామాన్యుడికి ఇది నిజంగా పండుగ ముందు వచ్చిన తీపి కబురు అని చెప్పవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర
Super El Nino: సూపర్ ఎల్‌నినో ఎఫెక్ట్.. ఫిబ్రవరి లోపు 4.5 లక్షల మరణాలు!
సంజూ శాంసన్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు!
Pitru Paksha 2026: ఈ ఏడాది పితృపక్షం ప్రారంభమయ్యేది అప్పుడే
ట్రంప్-జిన్‌పింగ్ భేటీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు