మంచి జీతం, ఉన్నత స్థాయి కెరీర్.. చాలామందికి ఇదే లక్ష్యం. కానీ ఉద్యోగంలో ఒత్తిడి, వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోవడంతో కొందరు తమ కెరీర్ దిశనే మార్చుకుంటారు. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 30 ఏళ్ల లిజ్ ఈస్ట్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. క్రిమినల్ డిఫెన్స్ రంగంలో లాయర్‌గా పనిచేసిన ఆమె.. ఆ ఉద్యోగాన్ని వదిలి ఫుల్‌టైమ్ డాగ్ వాకర్‌గా మారారు. ప్రస్తుతం గతంలో కంటే ఎక్కువగా సంపాదిస్తూ, తక్కువ గంటలు పనిచేస్తున్నానని ఆమె చెబుతున్నారు. లిజ్ ఈస్ట్ నాలుగేళ్ల పాటు క్రిమినల్ డిఫెన్స్ రంగంలో పనిచేశారు. పారాలీగల్‌గా ఉన్న సమయంలో అడ్మినిస్ట్రేటివ్ పనులతో పాటు కోర్టులకు వెళ్లడం, జైళ్లను సందర్శించడం, క్లయింట్లతో మాట్లాడటం వంటి బాధ్యతలు నిర్వహించారు. అయితే ఈ పని క్రమంగా ఆమెపై మానసికంగా, వ్యక్తిగతంగా ప్రభావం చూపింది. నిరంతర పని ఒత్తిడితో తన వయసు కంటే ఎక్కువగా అలసిపోయినట్లు అనిపించేదని ఆమె తెలిపారు. ‘‘ఇదేనా నా జీవితం?’’ అనే ఆలోచన ప్రతిరోజూ వచ్చేదని చెప్పారు.
‘లండన్ లైఫ్’ కూడా నచ్చలేదు
ఉద్యోగంతో పాటు లండన్‌లోని సామాజిక జీవనశైలి కూడా తనకు ఒత్తిడిని పెంచిందని ఈస్ట్ చెప్పారు. పని తర్వాత స్నేహితులతో బయటకు వెళ్లడం, ఆలస్యంగా ఇంటికి చేరుకోవడం సాధారణమైపోయిందని తెలిపారు. భవిష్యత్తులో కుటుంబంతో గడపడానికి ఇలాంటి జీవనశైలి అనుకూలంగా ఉండదని భావించారు. ‘డబ్బు బాగుంటుంది కాబట్టి చాలామంది ఇలాంటి ఉద్యోగాల్లో కొనసాగుతారు. కానీ అంత ఒత్తిడితో జీవించడం తనకు సరైనది కాదని అనిపించింది’ అని ఆమె పేర్కొన్నారు. ఈస్ట్ భర్త ఇప్పటికే డాగ్ వాకింగ్, డాగ్ బోర్డింగ్ వ్యాపారం చేస్తున్నారు. తన భర్త ఎంతో ఇష్టంగా ఆ పని చేయడం చూసిన తర్వాత.. తాను మాత్రం ప్రతి వారాంతం పని చేయాలంటే ఎందుకు భయపడుతున్నానని ఈస్ట్ ఆలోచించడం ప్రారంభించారు. దీంతో న్యాయరంగానికి గుడ్‌బై చెప్పి పెంపుడు జంతువుల సంరక్షణ వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
కొత్త వ్యాపారం ప్రారంభించిన వెంటనే ఆదాయం రాదనే ఉద్దేశంతో తన ఖర్చుల కోసం స్థానిక పబ్‌లో ఉద్యోగం చేశారు. అదే సమయంలో డాగ్ వాకింగ్ సేవకు కస్టమర్లను సంపాదించడం ప్రారంభించారు. కేవలం ఏడాదిలోనే ఆమెకు రెగ్యులర్ క్లయింట్లు పెరిగిపోయారు. ప్రస్తుతం రోజుకు నాలుగు గ్రూప్ వాక్స్ నిర్వహిస్తూ 20 నుంచి 30 కుక్కలను చూసుకుంటున్నారు. ఒక్క కుక్కకు గంటకు సుమారు £14 (దాదాపు రూ.1,800) వసూలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రోజుకు సుమారు దాదాపు రూ.38,500 నుంచి రూ.51,400 వరకు టర్నోవర్ వస్తుందని చెప్పారు. లాయర్ వృత్తిని వదిలి డాగ్ వాకర్‌గా మారడంపై కొందరు విమర్శించారని ఈస్ట్ తెలిపారు. తాను ఆరు సంవత్సరాలు చదివి సంపాదించిన విద్యను వృథా చేసుకున్నానని కొందరు భావించారని చెప్పారు. అయితే ఆ ఆరు సంవత్సరాల్లో నేర్చుకున్న విషయాలు ఇప్పటికీ తన రోజువారీ జీవితంలో ఉపయోగపడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
‘ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నా.. సగం సమయమే పనిచేస్తున్నా’
డాగ్ వాకర్‌గా మారిన తర్వాత తన ఆదాయం పెరిగిందని ఈస్ట్ తెలిపారు. గత కార్పొరేట్ ఉద్యోగంతో పోలిస్తే ఇప్పుడు నెలకు వేల పౌండ్లు ఎక్కువగా సంపాదిస్తున్నానని, అదే సమయంలో గతంలో పనిచేసిన సమయంతో పోలిస్తే దాదాపు సగం గంటలే పని చేస్తున్నానని చెప్పారు. అయితే కేవలం డబ్బు కోసం ఎవరూ ఈ వృత్తిని ఎంచుకోవద్దని ఆమె సూచించారు. జంతువులంటే నిజమైన ప్రేమ ఉండాలని, బయట ఉండటం, కుక్కలతో సమయం గడపడం ఇష్టపడేవారికే ఈ పని సరిపోతుందని తెలిపారు. నేను ఇప్పుడు ఉదయం లేచి పనికి వెళ్లడాన్ని ఎంతో ఇష్టపడుతున్నానని ఈస్ట్ అన్నారు. తన లా డిగ్రీ ఎప్పటికీ తన వద్దే ఉంటుందని, అవసరమైతే భవిష్యత్తులో తిరిగి న్యాయరంగంలోకి వెళ్లొచ్చని చెప్పారు. అయితే ప్రస్తుతం తాను చేస్తున్న పనిని ఎంతగానో ఇష్టపడుతున్నందున తిరిగి వెళ్లే అవకాశం లేదని తెలిపారు.