Headlines

Hyderabad: పాతబస్తీలో రూ.10 చిల్లర కోసం దారుణం.. ఆటో డ్రైవర్‌ను కొట్టిచంపిన దుండగులు..


హైదరాబాద్ పాతబస్తీలో ఆటో డ్రైవర్ హత్య కలకలం రేపింది. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో చిల్లర డబ్బుల విషయంలో మొదలైన వివాదం చివరకు దాడి, హత్యకు దారితీసింది. ఆటో డ్రైవర్ ముఖరంపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై ఫలక్‌నుమా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం రూ.10 చిల్లర విషయంలో జరిగిన వాగ్వాదం అనంతరం ఆటోరిక్షా డ్రైవర్‌ను కొట్టి చంపినట్లు పేర్కొంటున్నారు. చిల్లర విషయంలో డ్రైవర్‌కు, కొందరు వ్యక్తులకు మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత అతనిపై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామమని, దర్యాప్తు జరుగుతోందని ఒక పోలీసు అధికారి తెలిపారు. అసలు ఈ హత్యకు కారణం కేవలం చిల్లర డబ్బుల వివాదమేనా? లేక దీని వెనుక మరో వ్యవహారం ఉందా? ఇప్పుడు ఇదే ప్రశ్నలు పాతబస్తీలో చర్చనీయాంశంగా మారాయి.

వట్టేపల్లికి చెందిన గంజాయి బ్యాచ్ లీడర్ అండ్ యూట్యూబర్ అజీమ్ తల్లి మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆటోలో వట్టేపల్లి కి బయలుదేరింది. రూ.100 కిరాయికి మాట్లాడుకున్న ఆమె వద్ద రూ.200 నోటు ఉండటంతో చిల్లర విషయంలో ఆటో డ్రైవర్ ముఖరంతో వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని ఆమె తన కుమారుడు అజీమ్‌కు ఫోన్‌ చేసి చెప్పింది.

ఆ తర్వాత అజీమ్ అండ్ గ్యాంగ్ మరో ఇద్దరితో కలిసి వట్టేపల్లిలో ఆటో కోసం ఎదురుచూశాడని, ముఖరం అక్కడికి రాగానే అతడిపై దాడి చేశారని పేర్కొంటున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముఖరం ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అయితే ఈ ఘటనలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. దాడికి వచ్చిన కొందరు తమను మీడియా ప్రతినిధులుగా పరిచయం చేసుకున్నారని ముఖరం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మీడియా ముసుగులో కొందరు వ్యక్తులు పాతబస్తీలో తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ ఎంట్రీ..

ఆటో డ్రైవర్ ముఖరం హత్య విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ మోబిన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్యకాలమే అసెంబ్లీ సాక్షిగా ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తమని తాము రిపోర్టర్ అని చెప్పుకుంటూ ప్రజల్ని వేధిస్తున్నారని అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ప్రస్తావించారని.. మీడియా పేరుతో చలామణి అవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మోబిన్ డిమాండ్ చేశారు.

ముఖరం హత్య కేసులో సీసీ కెమెరా ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల ఫోన్ కాల్ డేటా, ఘటనకు ముందు జరిగిన ఫోన్ సంభాషణలు, దాడి తర్వాత నిందితుల కదలికలపై పోలీసులు పరిశీలిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *