Headlines

Mancherial: యజమాని మృతి.. చితి వరకు వెంట నడిచిన శునకం


మనిషికి, మూగజీవికి మధ్య ఉండే అనుబంధానికి మాటలు అవసరం లేదు. ప్రేమకు భాష లేదు.. విశ్వాసానికి హద్దులు లేవు. యజమాని తనను ఎంతగా ప్రేమించాడో గుర్తుపెట్టుకున్న ఓ పెంపుడు శునకం.. ఆయన చివరి ప్రయాణంలోనూ తోడుగా నిలిచిన హృదయ విదారక ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెట్టం వెంకన్న (65) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు. ఆదివారం కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో వెంకన్న కుటుంబ సభ్యులతో పాటు ఆయన పెంపుడు శునకం కూడా అడుగులో అడుగు వేసింది.

యజమాని ఇక లేడని తెలియజేసే దృశ్యాల మధ్య కూడా.. అతని కోసం ఎదురు చూస్తున్నట్లుగా చితి వద్దే ఉండిపోయిన శునకాన్ని చూసిన స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. కొందరు కంటతడి పెట్టుకున్నారు.

మాటలు లేని బంధం.. మరిచిపోలేని విశ్వాసం

మనిషి జీవితంలో పెంపుడు శునకాలు కేవలం కాపలా కాసే జంతువులు మాత్రమే కాదు. కుటుంబంలో ఒక సభ్యుడిగా మారి ప్రేమ, అనుబంధం, ఆప్యాయతను పంచుకుంటాయి. యజమాని చూపే ప్రేమను గుర్తుపెట్టుకుని.. కష్టసమయంలో తోడుగా నిలిచే స్వభావం వాటిలో కనిపిస్తుంది. వెంకన్న విషయంలోనూ అదే అనుబంధం కనిపించింది. జీవించి ఉన్నంతకాలం యజమానికి తోడుగా ఉన్న శునకం.. ఆయన చివరి ప్రయాణంలోనూ వెంట నడిచి తన విశ్వాసాన్ని చాటుకుంది. మనుషుల మధ్య బంధాలు కనుమరుగవుతున్న కాలంలో.. మాటలు లేని ఓ మూగజీవి చూపించిన ఈ అనుబంధం అక్కడున్న వారిని కదిలించింది.

వీడియో దిగువన చూడండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *