Headlines

‘5 సార్లు మెయిన్స్.. 3 సార్లు ఇంటర్వ్యూ.. ఆరో ప్రయత్నంలో IPS అయ్యాడు’ UPSCలో టాప్‌ లేపిన కడప బిడ్డ


ప్రస్తుతం ఒడిశా కేడర్‌లో సేవలందిస్తున్న రాఘవేంద్ర, ‘ఫేమ్ ఇండియా–ఆసియా పోస్ట్ టాప్ 25 పోలీస్ ఆఫీసర్స్ 2026’ జాబితాలో చోటు సంపాదించారు. విధి నిర్వహణలో నిబద్ధత, నేర నియంత్రణలో సామర్థ్యం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యసాహసాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పోలీసింగ్‌.. ఇలా విభిన్న రంగాల్లో ఆయన చూపిన ప్రతిభకు ఈ గుర్తింపు దక్కింది.

రాయచోటి నుంచి ఒడిశా కేడర్ వరకు

ఉమ్మడి కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన రాఘవేంద్ర 2019 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి. మొదటి నుంచే సవాళ్లను స్వీకరించే వైఖరితో పనిచేశారు. కెరీర్ ప్రారంభంలో ఒడిశాలోని బల్లిగుడ ఎస్‌డీపీఓగా పనిచేశారు. అనంతరం సమస్యాత్మకంగా పేరున్న నువాపడ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల విభాగాలను బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ నక్సల్స్ కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు అమలు చేశారు. ఆయన చూపిన సాహసం, వ్యూహాత్మక నైపుణ్యాలకు కేంద్ర హోంశాఖ నుంచి దక్షత ప్రత్యేక పతకం కూడా అందుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఒడిశాలోని ఝార్సుగూడ ఎస్పీగా పనిచేస్తున్న రాఘవేంద్ర పోలీసింగ్‌లో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అక్రమ కార్యకలాపాల నియంత్రణతో పాటు నేరాలను అరికట్టడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను పెంచేందుకు, డ్రైవర్ల బాధ్యతను నిర్ధారించేందుకు ఆటోలు, ట్యాక్సీలకు క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. సాంకేతికతను ఉపయోగించడంతో పాటు ప్రజలతో నేరుగా మమేకమయ్యే సామాజిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. రాఘవేంద్ర ప్రతిభ శిక్షణ దశలోనే వెలుగులోకి వచ్చింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ సమయంలో అత్యుత్తమ ప్రొబేషనర్‌గా నిలిచారు. గంజాం జిల్లాలో ప్రొబేషనర్‌గా పనిచేస్తున్న సమయంలో ఒక అత్యాచార కేసులో వేగంగా, సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించినట్లు ఆయన ప్రస్థానం తెలియజేస్తోంది.

ఇవి కూడా చదవండి



వైఫల్యాలను విజయంగా మార్చిన పట్టుదల

సివిల్ సర్వీసెస్‌ వంటి అత్యంత పోటీ పరీక్షలో వరుస వైఫల్యాలు ఎదురైనా రాఘవేంద్ర తన ప్రయత్నాలను ఆపలేదు. ఐదుసార్లు మెయిన్స్ రాయడం, మూడుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లడం.. చివరకు ఆరో ప్రయత్నంలో విజయం సాధించడం ఆయన పట్టుదలకు నిదర్శనం. ‘సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండటమే నా విజయ మంత్రం’ అని రాఘవేంద్ర చెబుతున్నారు. జాతీయ స్థాయిలో తనకు దక్కిన గుర్తింపును వ్యక్తిగత విజయంగా కాకుండా తనతో కలిసి పనిచేస్తున్న అధికారులు, పోలీస్ సిబ్బంది కృషికి అంకితం చేయడం ఆయనలోని వినయాన్ని చాటుతోంది. రాయచోటి నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగి, పోలీసింగ్‌లో సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్న రాఘవేంద్ర ప్రస్థానం పోటీ పరీక్షల అభ్యర్థులకు, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ఆశావహులకు స్ఫూర్తినిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *