Headlines

Onion Prices: సామాన్యులకు ధరల షాక్.. ఘాటెక్కిస్తున్న ఉల్లిపాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?


సామాన్యులపై నిత్యావసర సరుకుల భారం పడుతోంది. ఇప్పటికే షుగర్ ధరలు పెరగ్గా.. ఇప్పుడు కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉల్లిపాయల ధరలు ఘాటెక్కిస్తున్నాయి. ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. కొద్ది రోజుల క్రితం కిలో ఉల్లి రూ.20కే లభించగా.. ఇప్పుడు ఏకంగా రూ.60కి చేరుకుంది. కొద్ది రోజుల వ్యవధిలోనే రూ.40 పెరగడం సామాన్యులకు భారమనే చెప్పవచ్చు. ఎల్‌నీవో ప్రభావంతో పంట ఉత్పత్తి లేకపోవడం, తెగుళ్లు, ఇతర కారణాల వల్ల డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరలు ఇలాగే కొనసాగే అవకాశముందని, రానున్న రోజుల్లో పెరిగే అవకాశముందని అంచనాలు వేస్తున్నారు. కిలో ఉల్లి రూ.100కి చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. గతంలో పలుమార్లు ఉల్లి సెంచరీ కొట్టింది. ఇప్పుడు కూడా అదే తరహాలో పరిస్థితులు రానున్నాయని అంటున్నారు. దీంతో సామాన్యులు ఉల్లిని చూస్తే బెంబేలెత్తిపోతున్నారు.

హైదరాబాద్‌లో ధరలు చూస్తే..

-హైదరాబాద్‌లోని రైతు బజార్లలో ఉల్లిపాయల ధరలు పెరిగాయి. నగరంలోని రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.54 పలుకుతోంది. ఇక కిలో టమాట రూ.17. వంగ రూ.28, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.40, క్యాలీఫ్లవర్ రూ.21, క్యాబేజీ రూ.15, క్యారెట్ రూ.50, దొండకాయ రూ.35, ఆలు రూ.17, సొరకాయ రూ.9, పొట్లకాయ రూ.15, బీన్స్ రూ.60, గోరుచిక్కుడు రూ.28, చిక్కుడుకాయ రూ.40, దోసకాయ రూ.28, బీరకాయ రూ.32, కాకరకాయ రూ.32, చామగడ్డ రూ.28, కీరదోస రూ.40, క్యాప్చికం రూ.41, బీట్ రూట్ రూ.35, కందగడ్డ రూ.35, చిలగడదుంప రూ.35, మామిడి రూ.45, మునగ రూ.45 పలుకుతోంది.

-విజయవాడలో కిలో ఉల్లి రూ. 55కు లభిస్తున్నాయి. ఇక వంకాయలు రూ.22, టమాటా రూ.26, బెండకాయ రూ.18, పచ్చిమిర్చి రూ.30, కాకర రూ.32, బీర రూ.30, క్యాలీఫ్లవర్ రూ.35, క్యాబేజీ రూ.24, క్యారెట్ రూ.48, దొండకాయ రూ.24, బంగాళదుంప రూ.24, గోరుచిక్కుళ్లు రూ.28, దోస రూ.22, పొట్లకాయ రూ.13, చామదుంప రూ.34 పలుకుతున్నాయి.

అయితే రైతు బజార్లలో ధరలు ఇలా ఉండగా.. రిటైల్ మార్కె్ట్లలో కిలో ఉల్లి రూ.70కి విక్రయిస్తున్నారు. పంట దిగుబడి తగ్గడం, మార్కెట్లో సరఫరా లేకపోవడంతో ఉల్లి ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. జులైలో రోడ్ల పక్కన ట్రాలీ ఆటోల్లో రూ.100కు 4 కిలోల ఉల్లి ఇవ్వగా.. ఇప్పుడు ట్రాలీ వాహనాల్లో కూడా రూ.200కి 3 కిలోల చొప్పున అందిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం సామాన్యులకు ఉల్లి ధరల నుంచి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా రైతు బజార్లలో రూ.35కే కిలో చొప్పును అందిస్తోంది. అటు కేంద్రం కూడా రంగంలోకి దిగింది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా 1 లక్షా 21 వేల టన్నుల బఫర్ స్టాక్ అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు వ్యాపారులు కృత్తిమ కొరతను సృష్టించి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని మలక్ పేట్ మార్కట్లో క్వింటా ఉల్లి రూ.5500 పలుకుతోంది. అటు దేశవ్యాప్తంగా కూడా ధరలు పెరిగాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *