Headlines

Plastic Idols Worship: ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించవచ్చా..? శాస్త్రాల్లో అసలు ఏం ఉంది?


Plastic Idols Puja Telugu: పూజా మందిరంలో దేవతా విగ్రహాల ఏర్పాటు, వాటికి సంబంధించిన నియమాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ముఖ్యంగా, ప్లాస్టిక్‌తో చేసిన దేవతా విగ్రహాలను పూజించవచ్చా అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. ఈ సందేహాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి ధర్మశాస్త్ర పరంగా స్పష్టం చేశారు. వారి వివరణ ప్రకారం, ప్లాస్టిక్ విగ్రహాలను పూజించకూడదు.

భాగవతం పేర్కొన్న ప్రతిమా లక్షణాలు:

ధర్మశాస్త్ర గ్రంథాలలో ప్రముఖమైన భాగవతం, పూజకు అనువైన ప్రతిమల లక్షణాలను వివరంగా తెలియజేస్తుంది. శ్లోకం ప్రకారం, శైలీ, దారుమయీ, లౌహీ, లేప్యా, లేఖ్యా చ సైకతీ, మనోమయీ, మణిమయీ ప్రతిమా అష్టవిధా స్మృతాః” – అనగా, రాతి (శైలీ), చెక్క (దారుమయీ), లోహ (లౌహీ), పూత (లేప్యా), చిత్రపట (లేఖ్యా), ఇసుక (సైకతీ), మానసిక (మనోమయీ), రత్న (మణిమయీ) ప్రతిమలు అని ఎనిమిది విధాలుగా ఉండే ప్రతిమలనే మనం అర్చించాలి. ఈ ఎనిమిది వర్గాలలో ప్లాస్టిక్ అనేది ఏ మాత్రం ఇమడదు. లోహముతో చేయబడినది అర్చనకు యోగ్యమైనది, కానీ ప్లాస్టిక్ లోహం కాదు. ఇది ఆధునిక కాలంలో కనుగొనబడిన ఒక కృత్రిమ పదార్థం.

ప్లాస్టిక్, దాని ప్రభావం:

ఒకనాడు ప్లాస్టిక్ అనేది లేదని, దాని ఆవిష్కరణ మానవాళికి విద్వంసాన్ని ప్రారంభించిందని కాకునూరి సూర్యనారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ కనుగొనడం ద్వారా, మన వినాశనానికి మనమే గొయ్యి తవ్వుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. పర్యావరణ కాలుష్యానికి ప్లాస్టిక్ ఒక పెద్ద పెనుభూతంగా మారింది. ఉదయం ప్లాస్టిక్ బ్రష్‌తో దంతధావనం నుంచి రాత్రి పడుకునే వరకు మనుష్యుల జీవనాలు ప్లాస్టిక్ మయమైపోయాయి. చివరికి, మనుష్యుల నవ్వులు కూడా కృత్రిమంగా, “ప్లాస్టిక్ నవ్వులు” అయిపోయాయని ఆయన హాస్యంగా, వాస్తవికంగా వివరించారు. ఈ సందర్భంలోనే జగన్నాథ పండితరాయులు చెప్పిన ఆరు విధాల నవ్వులైన హసితము, అపహసితము, విహసితము, హాసితము, మందహాసము, అట్టహాసములను ప్రజలు మరచిపోతున్నారని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి



పూజా గదిలో ప్లాస్టిక్ నిషేధం:

ప్లాస్టిక్ విగ్రహాలను పూజా గదిలో ఉంచుకోకూడదు, వాటిని పూజించరాదు. సులభంగా లభిస్తుంది కాబట్టి వాటిని ఉపయోగించకూడదు. వాటిని కేవలం అలంకార ప్రాయంగా ముందు గదిలో పెట్టుకోవచ్చు కానీ ఆరాధనకు అవి పనికిరావు. పూజ కోసం చెక్కతో చేసినది, రాతితో చేసింది, పిండితో చేసింది, లోహంతో చేసింది, మనస్సుతో కల్పన చేసుకున్నది, గంధంతో చేసింది, చిత్రపటంగా ఉన్నది లేదా నీటిని పాత్రలో వేసి రేఖలుగా గీసి అందులో ఉన్నది అన్న భావనతో చేసిన ప్రతిమలను ఉపయోగించాలి. ఈ ఎనిమిది విధాలుగా మనం ప్రతిమను కల్పించుకోవాలి. ప్లాస్టిక్ ప్రతిమలు ఆరాధనకై పనికిరావు.

పూజా సామాగ్రి ఎంపిక:

విగ్రహాలే కాకుండా, పూజా గదిలో ఏ సామాగ్రి కూడా ప్లాస్టిక్‌తో చేసింది ఉండకూడదు. పూజా గదిలో రాగి, వెండి, ఇత్తడి – ఈ మూడు లోహాలతో ఉన్న వస్తువులు, పాత్రలు మాత్రమే ఉండదగ్గవి. ప్లాస్టిక్ కానీ, ఇనుము కానీ పూజకు వినియోగించకూడదు. ధార్మిక ఆచారాలను పాటించేటప్పుడు, మనం ఉపయోగించే వస్తువుల స్వచ్ఛత, ధర్మశాస్త్ర ఆమోదం తప్పనిసరి అని ఈ వివరణ ద్వారా స్పష్టమవుతుంది.

(Disclaimer: ఈ కథనంలోని సమాచారం ధార్మిక విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *