Headlines

ఏపీకి వర్ష సూచన.. సెప్టెంబర్ 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం


ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

సెప్టెంబర్ 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం

ఉత్తర థాయిలాండ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సెప్టెంబర్ 18 సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 19 సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం ఈ అల్పపీడనం క్రమంగా బలపడి, తదుపరి మూడు నుంచి నాలుగు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొంది.

కోస్తాంధ్ర, యానాంలో వాతావరణ పరిస్థితులు

సెప్టెంబర్ 16: ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం.

సెప్టెంబర్ 17, 18: ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం.

రాయలసీమలోనూ వర్షాలు

రాయలసీమ ప్రాంతంలో సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉండగా, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

కొనసాగుతున్న ఆవర్తనాలు, ద్రోణి ప్రభావం

ప్రస్తుతం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, ఈదురు గాలులు కొనసాగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణ పరిస్థితులను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఉరుములు, మెరుపుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *