Headlines

జంగారెడ్డిగూడెం గోల్డ్ లోన్ స్కామ్ కేసులో సంచలన ట్విస్ట్.. పోలీసుల అదుపులో అసలు దొంగలు!


ఏలూరు: జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో వెలుగుచూసిన భారీ గోల్డ్ లోన్ కుంభకోణం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ నగలు, పనికిరాని వస్తువులను ప్యాకెట్లలో ఉంచినట్లు వెలుగులోకి వచ్చిన ఈ కేసులో బ్యాంక్ మాజీ బ్రాంచ్ మేనేజర్ సహా ముగ్గురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. మొత్తం 176 గోల్డ్ లోన్ ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. సుమారు 6 కిలోల 449.50 గ్రాముల బంగారు ఆభరణాలు గల్లంతైనట్లు అధికారులు అంచనా వేశారు. వీటి మార్కెట్ విలువ రూ.10 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ వ్యవహారంలో 2016 నుంచి బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్న చలపాక రాజు కీలక నిందితుడిగా తేల్చారు. 2025 మేలో బ్రాంచ్ మేనేజర్‌గా కుమారపు భాస్కరరావు, జాయింట్ మేనేజర్‌గా తన్నేరు అజయ్‌బాబు బాధ్యతలు చేపట్టగా.. అదే ఏడాది అక్టోబర్‌లో జంగల సాయిరాజ్ క్రెడిట్ ఆఫీసర్‌గా చేరారు. వీరు అప్రైజర్‌తో కుమ్మక్కై బంగారం మాయం చేయడానికి సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై జూన్ 16న జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూలై 10న అప్రైజర్ చలపాక రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి, అతను బంగారం తాకట్టు పెట్టిన విక్రయ కేంద్రాల నుంచి రూ.5.81 కోట్లకు పైగా విలువైన 4.120 కిలోల బంగారం, రూ.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తులో బ్యాంకు రికార్డులు, లాకర్ కదలికలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను పరిశీలించిన పోలీసులు బ్యాంకు అధికారుల పాత్రపై ఆధారాలు సేకరించారు. దీంతో మాజీ బ్రాంచ్ మేనేజర్ కుమారపు భాస్కరరావు (35), జాయింట్ మేనేజర్ తన్నేరు అజయ్‌బాబు (40), క్రెడిట్ ఆఫీసర్ జంగల సాయిరాజ్ (33)లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఇప్పటివరకు రికవరీ అయిన బంగారం కాకుండా ఇంకా మిగిలిన ఆభరణాలు ఎక్కడున్నాయి? నిందితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు ఏమిటి? ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో మిగిలిన బంగారం రికవరీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *