తీజ్ పండుగలో అత్యంత కీలకమైన ఘట్టం గోధుమ మొలకల పెంపకం. పండుగ ఆరంభ దినాన తండా పెద్దల సమక్షంలో కన్నెపిల్లలు వెదురు బుట్టలను సిద్ధం చేసి, స్థానిక వాగుల నుంచి తెచ్చిన ఒండ్రు మట్టి, సహజ ఎరువును అందులో నింపుతారు. ఆపై గోధుమ విత్తనాలు నాటి, తండాలోని చలువ పందిరి లేదా ప్రత్యేక వేదిక వద్ద భద్రపరుస్తారు. తొమ్మిది రోజుల పాటు నిష్టగా ఉంటూ నిత్యం నీరు పోసి ఆ బుట్టలను సంరక్షిస్తారు. ఆరాధ్య దైవాలైన సీత్లా భవాని, మేరమ్మ దేవతలకు పూజలు నిర్వహించి, తమకు మంచి గుణవంతుడైన భర్త దక్కాలని, కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని వేడుకుంటారు. తొమ్మిదో రోజు నాటికి బుట్టల్లో గోధుమ నారు ఏపుగా, పచ్చగా పెరిగి ‘డూంగ్రో’గా మారుతుంది.