Mohammed Shami: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరులో భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన విశ్వరూపం ప్రదర్శించాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్‌పై ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన షమీ, అద్భుతమైన బౌలింగ్ స్పెల్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు గట్టిగా సిగ్నల్స్ పంపిస్తున్నాడు.
చెన్నై చెపాక్ మైదానంలో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్ల మధ్య దులీప్ ట్రోఫీ ఫైనల్ సమరం హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించింది. ఈస్ట్ జోన్ బ్యాటర్లు పరుగుల వరద పారించి ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు సాధించారు. సౌత్ జోన్ బౌలర్లు వికెట్లు తీయడానికి అల్లాడిపోయిన చోట, షమీ తన రివర్స్ స్వింగ్, సీమ్ పొజిషన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి షమీ వేసిన 11 ఓవర్లలో 4 మేడిన్లు ఉండటం విశేషం. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు.
ఈస్ట్ జోన్ నమోదు చేసిన భారీ స్కోరును ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన సౌత్ జోన్ జట్టును షమీ ప్రారంభంలోనే దెబ్బతీశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. జట్టులో దేవదత్ పడిక్కల్ 62 పరుగులతో రాణించగా, కెప్టెన్ తిలక్ వర్మ 56 పరుగులతో పోరాడుతున్నాడు. చామా మిలింద్ 2 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం సౌత్ జోన్ జట్టు ఇంకా 466 పరుగుల వెనుకబడి తీవ్ర ఒత్తిడిలో ఉంది. నాల్గో రోజు ఆటలో సౌత్ జోన్‌ను త్వరగా ఆలౌట్ చేసేందుకు షమీ మళ్లీ తన బౌలింగ్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు.
దులీప్ ట్రోఫీలో షమీ బౌలింగ్ ప్రదర్శన పతాక స్థాయిలో సాగుతోంది. సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులోనూ షమీ ఏకంగా 5 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టి ఈస్ట్ జోన్‌ను ఫైనల్ వైపు నడిపించాడు. సుదీర్ఘ కాలంగా బౌలింగ్‌లో అదే స్పీడు, లైన్ అండ్ లెంగ్త్ కొనసాగిస్తూ మునుపటి ఫామ్‌ను అభిమానులకు గుర్తుచేస్తున్నాడు.
మహమ్మద్ షమీ నిలకడగా వికెట్లు తీస్తుండటంతో జాతీయ జట్టులోకి అతడి రీఎంట్రీ పై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. భారత్ తరఫున షమీ చివరిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బరిలోకి దిగాడు. టెస్టుల్లో అయితే జూన్ 2023 నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. సుదీర్ఘ విశ్రాంతి తర్వాత మళ్లీ అదే వేగంతో బౌలింగ్ చేస్తుండటంతో, భారత సెలెక్టర్లు షమీ వైపు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..