ప్రతిరోజు అరగంట పాటు సూర్యరశ్మిలో గడపడం వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదాన్ని 40% పైగా తగ్గించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి, మెదడు కణాల మరమ్మత్తు, శుభ్రపరచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
వయసు పెరిగే కొద్దీ లేదా వంశపారంపర్యంగా వచ్చే మతిమరుపు చాలామందిని వేధించే సమస్య. అయితే, దీనిని నివారించడానికి ఒక సులువైన మార్గాన్ని చైనా పరిశోధకులు కనుగొన్నారు. 89 వేల మందిపై ఎనిమిదేళ్ల పాటు జరిపిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. ప్రతిరోజు కనీసం అరగంట పాటు పగటిపూట వెలుతురులో గడిపిన వారికి మతిమరుపు వచ్చే ప్రమాదం 40% నుంచి 50% వరకు తగ్గిందని రుజువైంది.
నేటి జీవనశైలిలో చాలామంది ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఇండోర్ వాతావరణంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇంట్లోనే ఉండటం, కారులో లేదా బస్సులో కార్యాలయానికి వెళ్లడం, కార్యాలయంలో కూర్చోవడం, తిరిగి ఇంటికి రావడం వంటి పనుల్లో ఎండ, గాలి, ప్రకృతి సిద్ధమైన వెలుతురు శరీరానికి తగలడం లేదు. దీనివల్ల సెరటోనిన్ వంటి హార్మోన్లు తగ్గిపోవడం, కార్టిజాల్ హార్మోన్ పెరగడం జరుగుతుంది. అయితే, సూర్యరశ్మికి గురైనప్పుడు సెరటోనిన్ పెరిగి, కార్టిజాల్ తగ్గుతుందని తెలిపారు.
సూర్యరశ్మి, మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న అసలు సంబంధం మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిలో ఉంది. పగటిపూట వెలుతురులో గడిపిన వారికి రాత్రిపూట మెలటోనిన్ హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంది. మెలటోనిన్ అనేది నిద్ర పుచ్చే హార్మోన్ అని అందరికీ తెలుసు. అయితే, ఇది కేవలం నిద్రకు మాత్రమే కాకుండా, మెదడు కణాల ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది.
మెదడు కణాలు రాత్రిపూట శుభ్రపరచుకోవడానికి మెలటోనిన్తో పాటు కొన్ని పోషకాలు కూడా అవసరం. విటమిన్ ఇ, విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి మెదడుకు చాలా ముఖ్యం. రాత్రి భోజనంలో బాదం పప్పులు, పొద్దుతిరుగుడు పప్పు వంటివి తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చియా సీడ్స్ను నానబెట్టుకుని తినాలి. అలాగే, విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉండే జామకాయను డిన్నర్లో చేర్చుకోవడం మంచిది. ఈ పోషకాలు మెదడు కణాల శుభ్రపరచే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.




