హైదరాబాద్: తెల్లాపూర్‌లోని మంథన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోకి విద్యార్థులు ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పిల్లలను బస్సుకు దూరంగా తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఒకటో తరగతి విద్యార్థులు బస్సు ఎక్కుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. పరిస్థితిని గమనించిన సిబ్బంది వెంటనే స్పందించి విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తప్పించుకున్నారు.
అయితే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ బస్సుల నిర్వహణ, ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలపై పాఠశాల యాజమాన్యం మరింత శ్రద్ధ పెట్టాలని కోరుతున్నారు. బస్సు సరైన కండిషన్లో లేకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గతంలోనూ ఇదే పాఠశాలకు చెందిన మరో బస్సు మంటల్లో దగ్ధమైన ఘటన జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలోని అన్ని బస్సుల ఫిట్నెస్, నిర్వహణపై అధికారులు సమగ్రంగా తనిఖీ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
తృటిలో తప్పిన ప్రమాదం
మంటలు చెలరేగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఉండి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తూ పిల్లలను వెంటనే బస్సు నుంచి దూరంగా తరలించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్కూల్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవసరమైన భద్రతా పరికరాలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, అత్యవసర ద్వారాలు తదితర ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా అనే అంశంపైనా ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనకు అసలు కారణం ఏమిటి? బస్సు ఫిట్నెస్ సక్రమంగా ఉందా? గతంలోనూ ఇలాంటి ఘటన జరిగిందన్న తల్లిదండ్రుల ఆరోపణల్లో వాస్తవం ఎంత? అనే అంశాలపై సంబంధిత అధికారులు, పాఠశాల యాజమాన్యం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
పిల్లల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా స్కూల్ బస్సుల ఫిట్నెస్, నిర్వహణపై అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..