Headlines

‘రోజుకు 4 గంటల నిద్రతో నా జర్నీ స్టార్ట్.. నో కోచింగ్..’ తండ్రి కల కోసం IAS అఖిల్‌ బుద్ధి సక్సెస్‌ జర్నీ


IAS అఖిల్‌ తండ్రి బాల్యం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో గడిచింది. పేదరికం కారణంగా ఆయన అమ్మమ్మ తనను పెంచలేకపోయారు. దీంతో ఒక కుటుంబానికి అప్పగించి, అక్కడ పని చేసుకుంటూ తినే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ కుటుంబం ఆయనకు పని చేయిస్తూనే చదువుకునే అవకాశం కల్పించింది. ఆ అనుభవమే ఆయన తండ్రికి విద్య విలువను తెలియజేసింది. అఖిల్‌ తల్లి కూడా ఏడో తరగతి వరకే చదువుకున్నారు. పెద్దగా ఆర్థిక లేదా విద్యా నేపథ్యం లేకపోయినా.. తమ పిల్లలకు మంచి విద్య అందించాలని అఖిల్‌ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.

రూ.4-5 వేల జీతంలోనూ కొడుకుకు బెస్ట్‌ ఎడ్యుకేషన్‌

అఖిల్‌ చిన్నతనంలో గ్రామాల్లో చాలామంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేవారు. కానీ తన తండ్రి మాత్రం అఖిల్‌ను చిన్నదైనా ప్రైవేట్‌ పాఠశాలలో చదివించారు. మంచి పుస్తకాలు కొనిచ్చేందుకు కూడా వెనుకాడేవారు కాదు. ‘మిగతా వాళ్లు గ్రే పేపర్‌లో చదివితే.. నా కొడుకు వైట్‌ పేపర్‌లో రాయాలి’ అనే ఆలోచనతో తనకు సాధ్యమైనంత ఉత్తమమైన విద్యను అందించేందుకు ప్రయత్నించారని అఖిల్‌ గుర్తుచేసుకున్నారు. అప్పుడు తన తండ్రి నెల జీతం కేవలం రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఉండేదని తెలిపారు. అయినప్పటికీ తన చదువు విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదన్నారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన అఖిల్‌కు ఇంటర్‌లో నారాయణ, శ్రీచైతన్య వంటి ప్రముఖ కళాశాలల్లో చదివే అవకాశం వచ్చింది. కానీ వాటి ఫీజులు సుమారు రూ.లక్ష వరకు ఉండేవి. తన తండ్రి ఆర్థిక పరిస్థితి తనకు తెలుసు. అందుకే హైదరాబాద్‌ వెళ్లడం తనకు ఇష్టం లేదని, సిద్దిపేటలోనే చదువుకుంటానని తండ్రికి చెప్పినట్లు అఖిల్‌ తెలిపారు. అసలు కారణం మాత్రం తండ్రిపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశమే. స్థానిక ప్రైవేట్‌ కళాశాలలో చదివిన అఖిల్‌ ఇంటర్‌లో 972 మార్కులు సాధించారు. ఎంసెట్‌కు కూడా సొంతంగానే సిద్ధమయ్యారు. చివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 20 వేల ర్యాంకు సాధించారు.

రూ.10 వేల ఫీజుతో ప్రభుత్వ కళాశాల ఎంపిక

20 వేల ర్యాంకుతో మంచి ప్రైవేట్‌ కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అఖిల్‌ ప్రభుత్వ కళాశాలను ఎంచుకున్నారు. దీనికి కూడా తండ్రిపై ఆర్థిక భారం పడకూడదనే కారణమే. ‘గవర్నమెంట్‌ కాలేజీలో చదివితే మంచి ఎక్స్‌పోజర్‌ వస్తుంది. ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు. క్యాంపస్‌కి వెళ్తాను’ అంటూ తండ్రిని ఒప్పించారు. వాస్తవానికి ప్రభుత్వ కళాశాలలో ఫీజు కేవలం రూ.10 వేల వరకు ఉండటమే ఆయన ఎంపికకు ప్రధాన కారణం. కళాశాలలో చేరిన తర్వాత రెండో సంవత్సరానికి వచ్చేసరికి అక్కడి సమస్యలు అఖిల్‌కు స్పష్టంగా కనిపించాయి. ఫ్యాకల్టీ కొరత, ల్యాబొరేటరీల కొరత వంటి సమస్యలు విద్యార్థులను ఇబ్బంది పెట్టేవి. దీంతో విద్యార్థి నాయకుడిగా అఖిల్‌ ముందుకొచ్చారు. తోటి విద్యార్థులను సమీకరించి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. తమ హక్కుల కోసం పోరాడటం అప్పుడే అలవాటైంది.

ఇవి కూడా చదవండి



సివిల్‌ ఇంజనీర్‌ కావాలా? సివిల్‌ సర్వెంట్‌ కావాలా?

మూడో సంవత్సరానికి వచ్చేసరికి అఖిల్‌ ముందు జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయం నిలిచింది. సివిల్‌ ఇంజనీర్‌గా కొనసాగాలా? లేక సివిల్‌ సర్వీసెస్‌లోకి వెళ్లాలా? అనే ఆలోచన మొదలైంది. అప్పుడే తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయని అఖిల్‌ తెలిపారు. ‘బిడ్డా.. నువ్వు సివిల్‌ సర్వెంట్‌ అయితే బాగుంటుంది. కలెక్టర్‌ అయితే ఇంకా బాగుంటుంది’ అని తన తండ్రి గతంలో చెప్పిన మాటలే తన నిర్ణయానికి కారణమయ్యాయని చెప్పారు. రెండు మార్గాల్లోనూ మొదటి నుంచి ప్రారంభించాల్సిందేనని భావించి.. తండ్రి కలను నెరవేర్చే దిశగా అడుగులు వేశారు. అలా మూడో సంవత్సరంలోనే ఐఏఎస్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించారు. అప్పుడు కోచింగ్‌ తీసుకోవడం గురించి పెద్దగా ఆలోచించలేదని అఖిల్‌ తెలిపారు. యూట్యూబ్‌ ద్వారా సివిల్స్‌ ప్రిపరేషన్‌ స్ట్రాటజీలు, గత ప్రశ్నపత్రాల విశ్లేషణ, పరీక్ష విధానం వంటి అంశాలను తెలుసుకున్నారు. తనకు అప్పటివరకు ఐఐటీ-జేఈఈ గురించి కూడా తెలియదని చెప్పారు. ఆ తర్వాత భారతదేశంలో అత్యంత కఠినమైన పరీక్ష ఏదని తెలుసుకునే ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్స్‌ గురించి తెలుసుకున్నారు. ‘ఇది నేను కొట్టాలి’ అనే పట్టుదల తనలో ఏర్పడిందని అఖిల్‌ చెప్పారు. అలా తండ్రి కల, తనలోని పట్టుదల రెండూ కలిసి సివిల్‌ సర్వీసెస్‌ వైపు నడిపించాయని తెలిపారు.

తప్పులే పాఠాలయ్యాయ్‌..

మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం చదువుకుంటూనే సివిల్స్‌ ప్రిపరేషన్‌ కొనసాగించారు. అయితే స్వీయ ప్రిపరేషన్‌ కావడంతో తొలినాళ్లలో ఎన్నో తప్పులు చేశారు. ఒక పుస్తకాన్ని ఏకంగా ఎనిమిది నెలలు చదివి, మూడు నోట్‌బుక్స్‌ నిండా నోట్స్‌ రాశారు. చివరకు ఆ పుస్తకం చదవాల్సిన అవసరం లేదని తెలుసుకున్నారు. అయితే ఆ తప్పులను తాను ప్రతికూలంగా చూడలేదని అఖిల్‌ తెలిపారు. ఆ అనుభవాలే తనను తీర్చిదిద్దాయని, తర్వాత ఏ పుస్తకం ఎలా చదవాలి, ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలి అనే అవగాహన వచ్చిందని చెప్పారు. కాలేజీ పూర్తయిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌కు వెళ్లి కోచింగ్‌ తీసుకోవాలా? లేక ఇంట్లోనే ఉండి ప్రిపేర్‌ అవ్వాలా? అనే ప్రశ్న ఎదురైంది. చివరకు ఇంట్లోనే ఉండి సివిల్స్‌కు సిద్ధం కావాలని అఖిల్‌ నిర్ణయించుకున్నారు. తన తండ్రి జీవితాన్ని, ఆయన పడిన కష్టాలను దగ్గరగా చూసిన అఖిల్‌కు.. ఆ కుటుంబ పరిస్థితుల్లో తండ్రిపై మరింత ఆర్థిక భారం వేయకూడదనే ఆలోచన ఉండేది. తండ్రి పేదరికం నుంచి నేర్చుకున్న విద్య విలువ.. తండ్రి కన్న కల.. తనలోని పట్టుదల.. ఈ మూడూ కలిసి అఖిల్‌ బుద్ధిని యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌లో 321 ర్యాంకులో నిలబెట్టి చివరికి ఐఏఎస్‌ అధికారిగా తీర్చిదిద్దాయి. ఆయన ప్రయాణం కేవలం ఒక సివిల్‌ సర్వెంట్‌ విజయగాథ మాత్రమే కాదు.. ఒక తండ్రి త్యాగానికి కొడుకు ఇచ్చిన విజయవంతమైన సమాధానంగా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *