హైదరాబాద్ ఉప్పల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తనను మోసం చేసిందనే మనస్తాపంతో 26 ఏళ్ల యువకుడు ఓయో హోటల్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వారసిగూడకు చెందిన చుక్క హేమంత్ సాగర్ (26) ఉప్పల్‌లోని NSL ఎరినా టవర్‌లో ఉన్న Foundever కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హేమంత్ శనివారం సాయంత్రం ఉప్పల్‌లోని ఎస్ఎల్ఎన్ గ్రాండ్ ఓయో హోటల్లో గది అద్దెకు తీసుకున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం వరకు గది నుంచి బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో వారు గదిని పరిశీలించగా బాత్రూమ్లో హేమంత్ ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హేమంత్ వద్ద లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ యువతి తనను మోసం చేయడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే హేమంత్ ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సదరు యువతితో అతడికి ఉన్న సంబంధం, వారి మధ్య ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తండ్రి మురళి సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.