Headlines

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. ప్రయాణికుడు మర్చిపోయిన రూ.3లక్షలు తిరిగిచ్చిన కండక్టర్!


ప్రజా రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తూ నిజాయితీ, బాధ్యతకు మారుపేరుగా నిలిచింది షాద్‌నగర్ ఆర్టీసీ డిపో కండక్టర్ సరిత. హజ్ యాత్రకు వెళ్లేందుకు షాద్‌నగర్‌కు చెందిన వ్యాపారి జహంగీర్ తన భార్యతో కలిసి బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే అఫ్జల్‌గంజ్ వద్ద బస్సు దిగిన అనంతరం నాంపల్లికి వెళ్లిపోయాడు, పొరపాటున 3 లక్షల నగదు ఉన్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు.

అయితే బస్సులో నగదు బ్యాగును గుర్తించిన కండక్టర్ సరిత, డ్రైవర్ నరసింహులుకు సమాచారం అందించి, నగదును భద్రపరిచారు. బ్యాగు బస్సులోనే మిగిలిపోయిన విషయం గుర్తించిన జహంగీర్ వెంటనే ప్రైవేట్ వాహనంలో బస్టాండ్‌కు చేరుకున్నారు. దీంతో అతన్ని గుర్తించిన కండక్టర్ సరిత, డ్రైవర్ నరసింహులు తను బస్సులో మర్చిపోయిన రూ. 3 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను తిరిగి అప్పగించారు. దీంతో బాధితుడు ఊపిరిపీల్చుకున్నాడు.

ఈ విషయం మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి చేరడంతో కండక్టర్ సరిత చూపిన నిజాయితీ, బాధ్యతాయుత వైఖరిని ఆయన ప్రశంసించారు. ఆర్టీసీ సిబ్బంది ప్రజలతో నిత్యం మమేకమై సేవలందిస్తున్నారని, ఇలాంటి ఉద్యోగుల నిజాయితీ సంస్థకు మంచి పేరు తీసుకువస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ప్రయాణికుడి నగదును ఎలాంటి స్వార్థానికి తావులేకుండా సురక్షితంగా తిరిగి అందించిన కండక్టర్ సరితను మంత్రి అభినందిస్తూ, ఆమె నిజాయితీ, మానవత్వం ఇతర ఆర్టీసీ ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.షాద్‌నగర్ డిపో అధికారులు సైతం కండక్టర్ సరితను అభినందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *