వరదలు, బురద, శిథిలాల మధ్య సహాయక బృందాలు రోజుల తరబడి గాలిస్తున్నాయి. ఈ క్రమంలో బురద, శిథిలాల కింద 10 రోజులుగా చిక్కుకుపోయిన ఓ చైనా కార్మికుడిని సజీవంగా గుర్తించి, ఎంతో శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. అలాగే, 64 ఏళ్ల నేపాల్ మహిళను కూడా శిథిలాల మధ్య నుంచి కాపాడి ఆస్పత్రికి తరలించారు.
త్రిశూలి 3A జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఓ చైనా కార్మికుడిని సహాయక బృందాలు రక్షించాయి. నేపాల్ సైనిక సిబ్బంది, దక్షిణ కొరియాకు చెందిన విపత్తు నిర్వహణ నిపుణులు కలిసి ఈ రక్షణ చర్యలు చేపట్టారు.
225 మీటర్ల పొడవైన సొరంగంలో చిక్కుకున్న కార్మికుడిని తీవ్రంగా శ్రమించి బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చిన వెంటనే అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కార్మికుడు ప్రాణాలతో బయటపడటంతో సహాయక బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి.
#अपरत्रिशुली१ सुरङबाट विदेशी नागरिकको जीवितै उद्धार#NepaliArmy#BhotekoshiFlood pic.twitter.com/An7wxJJEOh
— Nepali Army (@NepaliArmyHQ) September 5, 2026
మరోవైపు, నువాకోట్ పట్టణంలో 64 ఏళ్ల చండికా శ్రేష్ఠను సహాయక బృందాలు శనివారం సజీవంగా రక్షించాయి. దెబ్బతిన్న ఇంటి శిథిలాల కింద 10 రోజులుగా చిక్కుకున్న ఆమెను సిబ్బంది తీవ్రంగా శ్రమించి బయటకు తీసుకొచ్చారు. రక్షించిన వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి, మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్లో ఖాట్మండూకు తరలించారు. 10 రోజుల పాటు శిథిలాల కింద ఉన్నప్పటికీ చండికా ప్రాణాలతో బయటపడటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమెను రక్షించే సమయంలో తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
सशस्त्र प्रहरी बल नेपाल र अन्य निकाय सहितको सहयोगमा विदुर नगरपालिका १० बेत्रावतीमा रहेको बाढीद्वारा क्षतिग्रस्त घर भित्र पुरिरहेको अवस्थामा अन्दाजी ६० वर्षकी चण्डिका श्रेष्ठ नाम गरेकी महिलालाई करिब १ बजेर ४३ मिनेट जाँदा जीवितै उद्धार गरिएको छ।#APFNepal #peacesecuritycommitment pic.twitter.com/qOzm7YZVFU
— Armed Police Force, Nepal (@APF_Nepal) September 5, 2026
ఈ దృశ్యాలు నేపాల్లో వరదలు, కొండచరియలు, విధ్వంసం ఎంతటి విషాదాన్ని మిగిల్చాయో కళ్లకు కడుతున్నాయి. ఇదిలా ఉండగా, నేపాల్లోని 12 జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న దాదాపు 900 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియలేదని అధికారులు వెల్లడించారు. వీరిలో దాదాపు 500 మంది వివిధ సొరంగాల్లో చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
త్రిశూలి 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ సొరంగంలో విపత్తు జరిగిన తొమ్మిది రోజులకు, ఇద్దరు కార్మికులు ప్రాణాలతో బయటపడటం సంచలనం సృష్టించింది. విపత్తు సమయంలో లోపల చిక్కుకున్న వీరిని మెకానికల్ ఫోర్మెన్ సంజయ్ సాహ్, మెకానికల్ సూపర్వైజర్ కబీర్ మహర్జన్గా అధికారులు గుర్తించారు. హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని జపించడం తనకు గుండె ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. అంతకు ముందు సొరంగం నుంచి మాటలు వినిపిస్తున్నట్లు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నాయకుడు శ్రీరామ్ న్యూపానే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రెస్క్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్కడి వారు సజీవంగా ఉన్నట్లు నిర్ధారించుకుని భారీ యంత్రాలు, ప్రత్యేక పరికరాల సహాయంతో బురదను తొలగించి ఇద్దరినీ క్షేమంగా వెలికితీశారు.

2 Workers Rescued From Trishuli Tunnel In Nepal
ప్రస్తుతం ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నప్పటికీ, సొరంగంలో ఇంకా చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు, లాంగ్టాంగ్ ఖోలా జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం నుంచి రెస్క్యూ సిబ్బంది తాజాగా ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు
వరదల ధాటికి రసువా, నువాకోట్ జిల్లాల్లో 12 పాఠశాలలు ధ్వంసమయ్యాయి. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 600 మంది విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు. గల్లంతైన విద్యార్థుల కచ్చితమైన సంఖ్యను సేకరించడానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. విద్యార్థులతో పాటు 22 మంది ఉపాధ్యాయులు, పలువురు సిబ్బంది గల్లంతైనట్లు తెలుస్తోంది. నేపాల్లో ఆకస్మిక వరదలు సృష్టించిన భారీ విలయంలో ఇప్పటివరకు కనీసం 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5,000 మందికి పైగా ఆచూకీ లభించలేదని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.