Headlines

BCCI: క్రికెట్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. బీసీసీఐ బిగ్ ప్లాన్.. మళ్లీ ట్రై సిరీస్‌లు రాబోతున్నాయా?


BCCI: టీమిండియా వరుసగా మ్యాచ్‌లు ఆడటం వల్ల ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దొరకడం లేదనేది ప్రస్తుతం ప్రధాన విమర్శగా మారింది. సరిపడా రెస్ట్ లేకపోవడం వల్లే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఎదురుదెబ్బలు తగిలాయని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవల రివ్యూ మీటింగులో స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాబోయే ఎఫ్‌టీపీ (ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్) షెడ్యూల్‌లో భారీ మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. దైపాక్షిక సిరీస్‌ల మధ్య తగినంత వ్యవధి ఉండేలా చూడటంతో పాటు, విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

వచ్చే 2027 నుంచి 2031 కాలానికి సంబంధించిన క్రికెట్ క్యాలెండర్‌ను ఖరారు చేసేందుకు ఐసీసీ సెప్టెంబర్ 22, 23 తేదీల్లో దుబాయ్‌లో ఒక ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. ఈ భేటీకి బీసీసీఐ తన ప్రతినిధి బృందాన్ని పంపనుంది. ఈ సమావేశంలో కేవలం రెండు దేశాల మధ్య సాగే దైపాక్షిక సిరీస్‌ల కంటే, మూడు లేదా నాలుగు జట్లతో కూడిన ట్రై సిరీస్ టోర్నీలను పెంచాలని బీసీసీఐ గట్టిగా పట్టుబట్టనుంది. 2018 నిదాహాస్ ట్రోఫీ తర్వాత భారత్ మళ్లీ ఎలాంటి ట్రై సిరీస్ ఆడలేదు. ఇటువంటి బహుళ జట్ల టోర్నీలు అభిమానులకు వినోదాన్ని ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని బోర్డు భావిస్తోంది.

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ (సేనా) వంటి దేశాలను పర్యటించేటప్పుడు భారత జట్టు నేరుగా బరిలోకి దిగి నష్టపోతోంది. అక్కడి వాతావరణానికి, పిచ్‌లకు అలవాటు పడేందుకు ముందస్తుగా కొన్ని వార్మప్ మ్యాచ్‌లు లేదా ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తద్వారా ఆటగాళ్లు ఇబ్బంది పడకుండా మెరుగైన ప్రదర్శన చేసే వీలుంటుంది. ఈ విషయాన్ని ఎఫ్‌టీపీ రూపకర్తలకు బీసీసీఐ స్పష్టంగా ఆదేశించింది.

క్యాలెండర్‌ను సడలించడం మాటల్లో చెప్పినంత తేలిక కాదనేది వాస్తవం. రాబోయే నాలుగేళ్లలో ప్రతి ఏటా రెండు నెలల పాటు ఐపీఎల్ సాగుతుంది. దీనికి తోడు 2028లో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్, 2029లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2030 టీ20 వరల్డ్ కప్, 2031లో వన్డే వరల్డ్ కప్‌లతో ఐసీసీ టోర్నీలు ప్యాక్ అయి ఉన్నాయి. వీటితో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలతో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లు కూడా ఆడాల్సి ఉంది. ఇన్ని ప్రధాన పోటీల మధ్య ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి కల్పిస్తూ ఎఫ్‌టీపీని సజావుగా రూపొందించడం బీసీసీఐ ఎఫ్‌టీపీ టీమ్‌కు ఒక పెద్ద సవాలుగా మారనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *