Headlines

ఆ ఏడాది ఏకంగా 16 చిత్రాలు.. శోభన్ బాబుకు ఉన్న బిరుదు ఏంటో తెలుసా..?


ఎన్టీఆర్‌కి ఉన్న బిరుదు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఏఎన్నార్‌కి నట సామ్రాట్, కృష్ణకు నటశేఖర.. మరి శోభన్ బాబుకు ఉన్న బిరుదు ఏంటో తెలుసా..? నటభూషణ. అవును సినిమా టైటిల్స్‌లో, వార్త పత్రికల్లో ఆయన్ను నటభూషణ అని సంభోదించేవారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అత్యంత అద్భుతమైన కెరీర్‌ సాగించారు శోభన్ బాబు.  అయితే నటభూషణ శోభన్ బాబు కెరీర్‌లో 1971వ సంవత్సరం అత్యంత కీలకమైనది. ఆ ఏడాది ఆయన ఏకంగా 16 చిత్రాల్లో నటించారు, వాటిలో అనేకం నిర్మాతలకు, పంపిణీదారులకు మంచి ఆర్థిక లాభాలను అందించాయి. ఈ 16 చిత్రాలలో కలర్, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు రెండూ ఉన్నాయి. ఆ సంవత్సరంలో శోభన్ బాబు నటించిన ఏకైక పౌరాణిక చిత్రం సతీ అనసూయ. ఈ చిత్రంలో ఆయన నారదుడి పాత్రను పోషించారు, ఇది ఒక అతిథి పాత్ర. వరుసగా హీరో పాత్రలు పోషిస్తూ తీరిక లేకుండా ఉన్న సమయంలో, శోభన్ బాబు మొదట్లో ఈ అతిథి పాత్ర చేయడానికి ఆసక్తి చూపించలేదు. అయితే, చిత్ర నిర్మాత సుందర్ లాల్ నహతా ఆయనను వదిలిపెట్టకుండా, ఎలాగైనా నటించాల్సిందేనని ఒత్తిడి చేశారు. పారితోషికం ఎంతైనా సరే అని చెప్పడంతో, శోభన్ బాబు సాధారణంగా హీరో పాత్రకు తీసుకునే పారితోషికాన్ని డిమాండ్ చేసి, అందుకు తగ్గట్టే తీసుకుని ఈ పాత్రను పోషించారు. అప్పటికి ఆయనకు ఉన్న డిమాండ్ అలాంటిది.

బి.ఏ. సుబ్బారావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సతీ అనసూయ చిత్రంలో టైటిల్ పాత్రను కళాభారతి జమున పోషించారు. నటప్రపూర్ణ కాంతారావు అత్రి మహర్షిగా, శారద నర్మదగా, కైకాల సత్యనారాయణ కౌశికుడిగా, మధుమతి గంగగా, ప్రభాకర్ రెడ్డి శివుడిగా, రాజనాల శివానందుడిగా, రాజబాబు, మీనాకుమారి హాస్య జంటగా నటించారు. 1971 జూన్ 10న విడుదలైన ఈ చిత్రం, క్రైమ్ చిత్రాలు రాజ్యమేలుతున్న తరుణంలోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పౌరాణిక చిత్రం 15కు పైగా కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఆదినారాయణరావు సంగీతం అందించిన ఆలయమేల, అర్చనలేల, ఆరాధనలేల, ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో వంటి పాటలు నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *