Headlines

మనిషి చనిపోయాక ఆధార్, పాన్, ఓటర్ ఐడీలను ఏం చేయాలి..? ఈ రూల్స్ గురించి తెలుసుకోండి..


మనిషి చనిపోయాక ఆధార్, పాన్, ఓటర్ ఐడీలను ఏం చేయాలి..? ఈ రూల్స్ గురించి తెలుసుకోండి..

భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ వంటివి అత్యంత కీలకమైన గుర్తింపు పత్రాలు. బ్యాంకింగ్ లావాదేవీల నుంచి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాల వరకు ప్రతిదానికీ ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి. అయితే కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత వారి గుర్తింపు కార్డులతో ఏం చేయాలి? వాటిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలా లేక భద్రపరచాలా అనే విషయంలో చాలామందికి స్పష్టత ఉండదు. అటువంటి కీలక పత్రాల విషయంలో పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఆధార్ కార్డు

భారత పౌరులకు అత్యంత ముఖ్యమైన ఆధార్ కార్డు విషయంలో నేరుగా కార్డును సరెండర్ చేసే విధానం ప్రస్తుతం అమలులో లేదు. సాధారణంగా కుటుంబ సభ్యులు సంబంధిత మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నుంచి డెత్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ప్రభుత్వం జనన-మరణాల రికార్డులను ఆధార్ డేటాబేస్‌తో అనుసంధానించే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినందున, మరణ ధృవీకరణ పత్రం జారీ కాగానే ఆ వివరాలు నమోదవుతాయి. దీనివల్ల ఆ ఆధార్ నంబర్ దుర్వినియోగం కాకుండా సురక్షితంగా ఉంటుంది.

పాన్ కార్డు

బ్యాంకు ఖాతాలు, ఆస్తి క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు కీలకం. కుటుంబంలో ఎవరైనా మరణించిన వెంటనే పాన్ కార్డును రద్దు చేయకూడదు. మరణించిన వ్యక్తి పేరిట బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు, పెండింగ్ ఆదాయపు పన్ను రీఫండ్‌లు ఉంటే, ఆ లావాదేవీలు పూర్తయ్యే వరకు పాన్ కార్డును సురక్షితంగా ఉంచుకోవాలి. ఆర్థిక పరిష్కారాలు, చట్టబద్ధమైన క్లెయిమ్‌లు అన్నీ పూర్తయిన తర్వాత.. చట్టపరమైన వారసులు ఆ పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖకు సరెండర్ చేయవచ్చు. ఇది తప్పనిసరి కాకపోయినా, ఎలాంటి ఆర్థిక మోసాలు జరగకుండా ఉండేందుకు అప్పగించడం మంచిది.

ఓటర్ ఐడీ – పాస్‌పోర్ట్

మరణించిన వ్యక్తి పేరిట ఉన్న ఓటర్ ఐడీ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం నియమాలను అనుసరించాలి. స్థానిక ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారికి డెత్ సర్టిఫికేట్‌తో పాటు ఫామ్ 7 సమర్పించడం ద్వారా ఓటరు జాబితా నుంచి ఆ వ్యక్తి పేరును శాశ్వతంగా తొలగించవచ్చు. ఇక పాస్‌పోర్ట్ విషయానికొస్తే, దానిపై నిర్ణీత గడువు ఉంటుంది కాబట్టి కాలపరిమితి ముగిసిన తర్వాత అది దానంతట అదే చెల్లకుండా పోతుంది. దీని కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి డాక్యుమెంట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించడం ముఖ్యం. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. చట్టపరమైన లావాదేవీలు పూర్తయ్యాక ఈ పత్రాల వివరాలను సరిగ్గా క్లోజ్ చేయడం కుటుంబ సభ్యుల బాధ్యత.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *