Headlines

నేపాల్ వరదల్లో గల్లంతైన తెలంగాణకు చెందిన మరో ఎన్నారై ఫ్యామిలీ.. ఆచూకీ కోసం గాలింపు!


కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఓ ఎన్నారై కుటుంబం నేపాల్ వరదల్లో గల్లంతైంది. భార్యాభర్తలతో పాటు వారి కుమారుడు ఆచూకీ లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2023లో యూకే నుంచి తిరిగి వచ్చిన ఎన్నారై శ్రీధర్, సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని మై ఫెయిల్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసి కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. శ్రీధర్, ఆయన భార్య దీప్తి, కుమారుడు అభినవ్.. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 13న కైలాస్ మానస సరోవర్ యాత్రకు బయలుదేరారు.

యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో భాగంగా ఆగస్టు 26న గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అయితే అదే సమయంలో ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా భారీ వరదలు ముంచెత్తాయి. వరదల ఉద్ధృతికి ఇమ్మిగ్రేషన్ కేంద్రం పరిసరాల్లో పలువురు యాత్రికులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో శ్రీధర్, ఆయన భార్య దీప్తి, కుమారుడు అభినవ్ కూడా ఉన్నట్టు ఈశా ఫౌండేషన్ ధ్రువీకరించింది. యాత్రికులంతా గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న సమయంలో ఆకస్మిక వరదలు చుట్టుముట్టాయని.. పలువురు కుటుంబాలు ఆచూకీ లేకుండా పోయాయని ఫౌండేషన్ తన ప్రకటనలో వెల్లడించింది.

మరోవైపు..శ్రీధర్ కుటుంబం గల్లంతైన విషయం తెలియడంతో వారి బంధువులు, స్నేహితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన శ్రీధర్ కుటుంబానికి యూకే పౌరసత్వం ఉన్నట్లు సమాచారం.శ్రీధర్ సోదరుడు కూడా యూకేలోనే నివసిస్తున్నారు. ప్రమాద విషయం తెలియగానే ఆయన తెల్లాపూర్‌కు వచ్చి..అక్కడి నుంచి నేపాల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. యూకే పౌరసత్వం ఉన్న నేపథ్యంలో.. శ్రీధర్ కుటుంబం కోసం యూకే ప్రభుత్వం కూడా సహాయక చర్యలు, గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *