Headlines

Womens Champions Trophy 2027: భారత చేతికి ఛాంపియన్స్ ట్రోఫీ.. శ్రీలంకకు ఎన్ని వందల కోట్ల నష్టమో తెలుసా ?


Womens Champions Trophy 2027: మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక కోల్పోయింది. బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువ కావడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శ్రీలంకకు షాక్ ఇస్తూ ఈ చారిత్రాత్మక టోర్నీని నిర్వహించే అవకాశాన్ని భారత్‌కు కట్టబెట్టింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం వల్ల శ్రీలంక క్రికెట్ బోర్డు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింది. ఆతిథ్య హక్కులు చేతి నుంచి జారిపోవడంతో దాదాపు 20 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆ దేశం కోల్పోనుంది. మన భారతీయ కరెన్సీలో లెక్కిస్తే ఇది రూ.188 కోట్లకు పైగానే ఉంటుంది. పర్యాటకం, ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్ల రూపంలో రావాల్సిన భారీ సొమ్మును లంక బోర్డు చేతులారా పోగొట్టుకుంది.

శ్రీలంక క్రికెట్ బోర్డులో అంతర్గత ప్రజాస్వామ్యం క్షీణించడం, ఎన్నికలు జరపకుండా ప్రభుత్వం సొంతంగా ఒక కమిటీని నియమించడం ఐసీసీ నిబంధనలకు తీవ్ర విఘాతం కలిగించింది. ఐసీసీ రాజ్యాంగం ప్రకారం క్రికెట్ బోర్డుల పాలనలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదు. పదే పదే హెచ్చరించినా లంక ప్రభుత్వం తీరు మారకపోవడంతో, ఆతిథ్యాన్ని రద్దు చేయడం మినహా ఐసీసీకి వేరే మార్గం లేకపోయింది. గతంలోనూ అండర్-19 ప్రపంచకప్ ఆతిథ్యాన్ని ఇలాగే శ్రీలంక నుంచి ఉపసంహరించుకుని దక్షిణాఫ్రికాకు కేటాయించడం గమనార్హం.

శ్రీలంక నుంచి టోర్నీని తరలించాలని భావించిన ఐసీసీ, దానికి ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, భారత్ పేర్లను పరిశీలించింది. అత్యుత్తమ మౌలిక వసతులు, భారీ మైదానాలు, ఆర్థికంగా బలమైన మార్కెట్ కలిగి ఉన్న భారత్ వైపే ఐసీసీ మొగ్గు చూపింది. దీంతో తొలి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ సమరానికి మన దేశం వేదిక కాబోతోంది.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాదే ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జరగనుంది. మొత్తం 6 బలమైన జట్లు ఈ సమరంలో తలపడనున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో పోటీపడతాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడతాయి. సొంత తప్పిదాల వల్ల శ్రీలంక ఆర్థికంగా, ప్రతిష్టపరంగా తీవ్రంగా నష్టపోగా, భారత క్రికెట్ అభిమానులకు మాత్రం ఇది గుడ్ న్యూస్గా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *