Headlines

సీజన్ అయిపోతోంది ఇప్పుడే తినండి.. అడవి కాకరకాయ అసలు స్పెషాలిటీ ఇదే..


వర్షాకాలంలో లభించే అతి ముఖ్యమైన కూరగాయల్లో బోడ కాకరకాయ ఒకటి.. దీనిని అడవి కాకరకాయ అని కూడా పిలుస్తారు. ఈ సీజనల్ కూరగాయ జూన్ నుండి సెప్టెంబర్ మాసం వరకు ఎక్కువగా లభిస్తుంది. నగర మార్కెట్లలో, ముఖ్యంగా రైతు బజార్లలో బోడ కాకరకాయలు విస్తృతంగా విక్రయిస్తారు. ఈ కూరగాయకు ప్రస్తుతం అసాధారణమైన డిమాండ్ ఉంది.. ప్రధానంగా దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఎంతో మంది దీనిని తినేందుకు ఇష్టపడతారు. బోడ కాకరకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ (కరోటిన్), విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ తోపాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ లభిస్తాయి. దీనిలోని డైటరీ ఫైబర్ (ఫైబర్) జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఎన్నో ప్రయోజనాలు..

బోడ కాకరకాయలో అనేక పోషక విలువలు దాగి ఉన్నాయి. ఇది ముఖ్యంగా షుగర్ (మధుమేహం) స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే షుగర్ వ్యాధితో బాధపడేవారు దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు బోడ కాకరకాయలో పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపిక. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పండే బోడ కాకరకాయ ఇప్పుడు నగర ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తోంది. రైతులు తమ పొలాల నుండి తాజా బోడ కాకరకాయలను నేరుగా రైతు బజార్లకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ కాయలు చాలా తాజాగా, మంచి ఆకృతితో కనిపిస్తాయి. ఇవి కొంత బొడిపెలుగా, గుండ్రంగా ఉంటాయి.

బోడ కాకరకాయ రుచి కూడా ఎంతో బాగుంటుంది. దీన్ని కూరగా వండుకోవచ్చు లేదా ఫ్రై చేసుకొని తినవచ్చు. రెండు విధాలుగానూ ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో పావుకిలో బోడ కాకరకాయ ధర సుమారు 50 రూపాయలు పలుకుతోంది. ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, దానికున్న ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా కొనుగోలుదారులు వెనుకాడకుండా కొనుగోలు చేస్తున్నారు. తాజాదనం, సహజత్వం కూడా దీని డిమాండ్‌కు ఒక కారణం. రైతులు స్వయంగా చెట్ల నుండి తీసుకొచ్చి విక్రయించడం వల్ల ఇవి ఎంతో తాజాగా ఉంటున్నాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *