Headlines

Kurnool: కామన్‌సెన్స్ లేని డాక్టర్లు.. మరీ ఈ స్థాయికి దిగజారాలా..?


Kurnool: కామన్‌సెన్స్ లేని డాక్టర్లు.. మరీ ఈ స్థాయికి దిగజారాలా..?

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రి.. నిత్యం రోగులకు వైద్యం అందించాల్సిన చోట ఇప్పుడు ఇద్దరు వైద్యుల మధ్య వివాదం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రొఫెషనల్‌ విభేదాలు, ఆధిపత్య పోరు చివరకు చేతబడి, క్షుద్రపూజల ఆరోపణల వరకు వెళ్లాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఆది నాగశేషు, అనస్తీషియా వైద్యురాలు డాక్టర్‌ లక్ష్మి మోనాలిసా మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న ఈ వివాదం తాజాగా మరో మలుపు తిరిగింది.

డాక్టర్‌ లక్ష్మి మోనాలిసా తనపై క్షుద్రపూజలు, చేతబడి చేశారంటూ డాక్టర్‌ ఆది నాగశేషు ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనకు సంబంధించిన కొన్ని ఆరోపణలకు, అనుమానాలకు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఉన్నాయంటూ ఆయన చెబుతున్నట్లు సమాచారం. సూపరింటెండెంట్‌ పదవి, ప్రమోషన్‌ అంశాల్లో నెలకొన్న పోటీ కారణంగానే ఈ విభేదాలు మరింత ముదిరాయన్న చర్చ ఆసుపత్రి వర్గాల్లో జరుగుతోంది. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? చేతబడి జరిగిందా? లేక వ్యక్తిగత, వృత్తిపరమైన విభేదాలు మరో రూపం దాల్చాయా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.

ప్రభుత్వ వైద్యులే.. మూఢనమ్మకాల ఆరోపణలేంటి?

వైద్య వృత్తి అంటేనే శాస్త్రీయ దృక్పథం, ఆధారాలతో కూడిన వైద్యం. అలాంటి వృత్తిలో ఉన్న ఇద్దరు వైద్యుల మధ్య వివాదం చేతబడి, క్షుద్రపూజల ఆరోపణల వరకు వెళ్లడంపై ఆసుపత్రి సిబ్బందిలోనూ, ప్రజల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. రోగులకు శాస్త్రీయ వైద్యం అందించాల్సిన వైద్యులే ఇలాంటి ఆరోపణలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇద్దరు వైద్యుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరును చూసి ఆసుపత్రి సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రైవేట్‌ క్లినిక్‌లపైనా ఆరోపణలు

ఇద్దరు వైద్యులు ఆదోనిలో ప్రైవేట్‌ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వైద్యులుగా విధులు నిర్వహిస్తూ ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవమెంత? నిబంధనలకు అనుగుణంగానే ఈ వ్యవహారం సాగుతోందా? అనే అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది.

మొత్తంగా ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు వైద్యుల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు ఆసుపత్రి పరిపాలనను దాటి ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. చేతబడి చేశారన్న ఆరోపణల నుంచి ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ వరకు వస్తున్న ప్రతి అంశంపైనా సమగ్ర విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ వైద్యులపై వస్తున్న ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఆరోపణలు నిరాధారమైతే వాటికి కూడా స్పష్టత ఇవ్వాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *