Headlines

Watch: అర్ధరాత్రి రోడ్డుపై చిరుతల పరుగు..! పంట పొలాల్లో ఐదు పిల్లలతో తల్లి చిరుత..!


నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. అలూర్ మండలం కల్లెడ శివారులో రాత్రి వేళ ఐదు చిరుత పిల్లలు రోడ్డుపై సంచరించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తల్లి చిరుతతో కలిసి పిల్లలు రోడ్డు దాటుతున్న సమయంలో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన మొబైల్‌లో వీడియో తీశారు.

అలూర్ మండలం కల్లెడ నుంచి గాలిబ్ నగర్ వెళ్లే రహదారిపై రాత్రి సమయంలో చిరుత కుటుంబం కనిపించింది. చీకట్లో రోడ్డుపై చిరుత పిల్లలు పరుగులు తీస్తూ ఒకవైపు నుంచి మరోవైపునకు పరుగులు పెడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. తల్లి చిరుత కూడా పిల్లల వెంట ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

చిరుత పిల్లలు రోడ్డుపై కనిపించడంతో వాహనదారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో చిరుతల సంచారం పెరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ముఖ్యంగా చిరుత పిల్లలు తల్లి చిరుతతో కలిసి సంచరిస్తుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని అంటున్నారు.

కల్లెడ శివారులో వ్యవసాయ పొలాలు, అటవీ ప్రాంతాలకు సమీపంలో చిరుతల సంచారం ఉండటంతో రైతులు రాత్రివేళ పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. పశువులు, మేకలు, గొర్రెలపై చిరుతలు దాడి చేసే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. రహదారిపై ప్రయాణించే వాహనదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. మరోవైపు, అటవీ శాఖ అధికారులు చిరుతల కదలికలను గుర్తించి, వాటి సంచారంపై నిఘా పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిరుతలు ఏ ప్రాంతంలో తిరుగుతున్నాయో గుర్తించేందుకు కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అయితే చిరుత పిల్లలు కనిపించిన ప్రాంతంలో ప్రజలు గుంపులుగా వెళ్లడం, వాటిని వెంబడించడం, దగ్గరగా వెళ్లి వీడియోలు తీయడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల సమీపంలో తల్లి చిరుత ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *