Headlines

ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ.. కోతులను తరిమికొడుతున్న ఎలుగుబంటి? అసలు సంగతి ఇదే!


ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ.. కోతులను తరిమికొడుతున్న ఎలుగుబంటి? అసలు సంగతి ఇదే!

ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కోతుల సంచారం తీవ్ర సమస్యగా మారింది. ఇళ్లపై బడటం, మనుషులపై దాడులు చేయడమే కాకుండా, కష్టపడి పంటలు సాగు చేసే రైతులకు కోతులు పెద్ద సవాలుగా పరిణమించాయి. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక, ఎండలకు వడలిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు అరకొర నీటితో పోరాటం చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోతుల దండు పంటలపైపడి కాపు, పూత, పిందెలను నాశనం చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం, కాకర్ల గ్రామానికి చెందిన వేముల నాగయ్య అనే రైతు తన పొలంలో పత్తి సాగు చేశారు. ప్రస్తుతం పత్తి పంట కాపు, పూత, పిందె దశలో ఉంది. అయితే, ప్రతిరోజూ వందలాదిగా వస్తున్న కోతుల దండు చేనుపైబడి పూతను తుంచేస్తూ, పిందెలను కొరికి పడేస్తున్నాయి. కోతులను బెదిరించడానికి నాగయ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కోతుల బారి నుండి తన ప్రాణప్రదమైన పంటను రక్షించుకోవడానికి నాగయ్య ఒక వినూత్నమైన ఉపాయాన్ని ఆలోచించారు. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా దాదాపు రూ. 1,500 ఖర్చు చేసి ఎలుగుబంటిని పోలిన దుస్తులు, మాస్క్‌ను తెప్పించారు.

ఈ ఎలుగుబంటి దుస్తులను ధరించి ఆయన ప్రతిరోజూ తన పత్తి చేనులో తిరగడం ప్రారంభించారు. పొలంలో ఎలుగుబంటి సంచరిస్తుందని భావించిన కోతులు భయపడి ఆ దరిదాపుల్లోకి రావడానికి జంకుతున్నాయి. ఈ వినూత్న ప్రయోగంతో తన పొలంలో కోతుల బెడద గణనీయంగా తగ్గిందని నాగయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా దిష్టిబొమ్మలు లేదా శబ్దాలు చేసే పరికరాలు కొద్దిరోజులకే ప్రభావం కోల్పోతాయి. కానీ, మనిషే స్వయంగా ఎలుగుబంటి వేషధారణలో పొలంలో కదలడంతో కోతులు నిజంగానే క్రూరమృగం వచ్చిందేమోనని భయాందోళన చెందుతున్నాయి. రైతు నాగయ్య చేసిన ఈ తెలివైన ఆలోచన ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల రైతుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. పలువురు రైతులు ఆయనను కలిసి ఈ ఎలుగుబంటి డ్రెస్ వివరాలు, దాన్ని ఎలా ఉపయోగించాలనే విశేషాలను అడిగి తెలుసుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో పంటను కాపాడుకున్న ఈ రైతు ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *