Headlines

7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన జిల్లా యంత్రాంగం.. చిన్నారి ధైర్యానికి ఫిదా..!


ఉత్తరప్రదేశ్: సాధారణంగా తమ ప్రాంతంలోని సమస్యలను పెద్దలు అధికారుల దృష్టికి తీసుకెళ్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో ఏడేళ్ల చిన్నారి చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకటో తరగతి చదువుతున్న సమ్రా నాజ్.. తన ప్రాంతంలోని అధ్వాన్నమైన రహదారి సమస్యను ఏకంగా జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లింది. రోడ్డు పరిస్థితి కారణంగా తాను, తనతో పాటు స్థానికులు, పాఠశాల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ డీఎంకు వినతిపత్రం సమర్పించింది.

సోమవారం (ఆగస్టు 31) సమ్రా నాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మౌ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంది. జిల్లా మేజిస్ట్రేట్ ఆనంద్ వర్ధన్‌ను కలిసి తన ప్రాంతంలోని రోడ్డు దుస్థితిని వివరించింది. కంకర కూడా సరిగ్గా వేయని మట్టి రహదారి అధ్వాన్నంగా మారిందని, నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణించాల్సి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే సమయంలో పిల్లలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె డీఎంకు వివరించింది.

కొన్ని రోజుల క్రితం సమ్రా తన ప్రాంతంలోని రోడ్ల దుస్థితిపై మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారినట్లు సమాచారం. ఆ వీడియోలో రహదారి పరిస్థితిని చూపిస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె ముక్కుసూటిగా ప్రశ్నించింది. చిన్న వయసులోనే స్థానిక సమస్యపై ధైర్యంగా స్పందించిన సమ్రా తీరుపై పలువురు ప్రశంసలు కురిపించారు. సమ్రా నుంచి వినతిపత్రం స్వీకరించిన డీఎం ఆనంద్ వర్ధన్.. సమస్యను పరిశీలించేందుకు అధికారుల బృందాన్ని సంబంధిత ప్రాంతానికి పంపుతామని తెలిపారు. రహదారి పరిస్థితిని పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఏడేళ్ల వయసులోనే తన ప్రాంత సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమ్రా చొరవ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలు తమ వంతు బాధ్యతగా అధికారులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆమె చర్య మరోసారి గుర్తుచేసింది. వయసు చిన్నదైనా.. సమస్యపై ప్రశ్నించే ధైర్యం ఉంటే మార్పు కోసం అడుగు వేయొచ్చని సమ్రా చూపించింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *