Headlines

Telangana: మృత్యువులోను వీడని అన్నదమ్ముల అనుబంధం..


తమ్ముడి మరణవార్త విన్న అన్న గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. చిన్ననాటి నుంచి కలిసిమెలిసి జీవించిన అన్నదమ్ములు.. చివరకు మరణంలోనూ విడిపోని బంధంగా నిలిచారు. పెద్దకొత్తపల్లి మండలం పెరుమాండ్లపల్లి గ్రామానికి చెందిన సలుకూటి లింగారెడ్డి (90) కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆరోగ్య సమస్య తీవ్రం కావడంతో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఆయన మృతి చెందారు. లింగారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన అన్న సలుకూటి సింహారెడ్డి (92) తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అదే సమయంలో పెరుమాండ్లపల్లి గ్రామంలో ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

చిన్ననాటి నుంచి ఎంతో అనుబంధంతో కలిసి జీవించిన అన్నదమ్ములు.. ఒకరి మరణవార్త మరొకరి ప్రాణాలను తీసేంతటి అనుబంధాన్ని కలిగి ఉండటం గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. ఇద్దరూ ఒకే సమయంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో పెరుమాండ్లపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సింహారెడ్డికి ఇద్దరు కుమారులు అక్షిత్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, కుమార్తె అనురాధ ఉన్నారు. లింగారెడ్డికి కుమారులు రఘుమారెడ్డి, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, కుమార్తె ఇందిర ఉన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *