Headlines

Andhra Pradesh: పుస్తలమ్మేలా చేసింది ఈ పులసేనా.. యానాం వేలంలో ఎంత ధర పలికిందంటే..?


రుచికి రారాజుగా పేరుగాంచిన ప్రసిద్ధ గోదావరి పులస చేపలకు మార్కెట్‌లో డిమాండ్ ఆకాశాన్నంటుంది. తాజాగా పుదుచ్చేరి పరిధిలోని యానాం రేవులో నిర్వహించిన బహిరంగ వేలంలో పులస చేపలు రికార్డు స్థాయి ధర పలికాయి. కేవలం 1.300 కేజీల బరువున్న ఒక్క మగ పులస చేప ఏకంగా రూ. 24,000 పలకడం ఈ సీజన్‌లోనే సరికొత్త రికార్డుగా నిలిచింది. యానాం మత్స్యకారుల వలకు చిక్కిన రెండు పులస చేపలకు శుక్రవారం రేవులో వేలం పాట నిర్వహించారు. వీటిలో 1.300 కేజీల బరువున్న పెద్ద మగ పులసను రూ.24,000కు, మరో చిన్న పులస చేపను రూ. 7,500కు స్థానిక మత్స్యకార మహిళ పార్వతి మొత్తం రూ.31,500 చెల్లించి వేలంలో దక్కించుకున్నారు. ఈ ఏడాది మగ పులసకు ఈ స్థాయిలో రికార్డు ధర పలకడం ఇదే తొలిసారని స్థానిక మత్స్యకారులు వెల్లడించారు.

పులసకు ఎందుకింత క్రేజ్?

బంగాళాఖాతంలో ఉప్పునీటిలో ఉండే ఇలస చేపలు సంతానోత్పత్తి కోసం వర్షాకాలంలో గోదావరి ఎర్రటి వరద నీటికి ఎదురీదుతూ నదిలోకి ప్రవేశిస్తాయి. తీపి నీటిలో ప్రయాణించి, గోదావరి మట్టిని ఆహారంగా తీసుకునే క్రమంలో వీటి శరీర నిర్మాణం, రుచి పూర్తిగా మారిపోయి అద్భుతమైన పులసగా రూపాంతరం చెందుతాయి. గోదావరి నది లోపలికి వచ్చే కొద్దీ వీటి రుచి మరింత పెరుగుతుండటంతో వీటికి భారీ డిమాండ్ ఉంటుంది.

ఈ ఏడాది భారీగా తగ్గిన లభ్యత

సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి వరదలు పోటెత్తే సమయంలో పులసలు విరివిగా లభిస్తుంటాయి. అయితే ఈ సీజన్‌లో వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వల్ల గోదావరికి వరద నీరు ఆలస్యంగా చేరింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో పులస చేపల లభ్యత బాగా తగ్గిపోయింది. వలలకు ఎక్కడో ఒకటి అరా మాత్రమే చిక్కుతుండటంతో.. మార్కెట్‌కు వచ్చిన చేపలను దక్కించుకునేందుకు వ్యాపారులు, మాంసాహార ప్రియులు పోటీపడుతున్నారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతోనే పులస ధరలు చుక్కలు తాకుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *