
హైదరాబాద్, ఆగస్ట్ 2: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన అఖిల భారత కోటా (AIQ), డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్ర కోటా సీట్ల భర్తీ కోసం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం వైద్య కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలను కూడా పని దినాలుగా పరిగణించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అన్ని వైద్య కళాశాలలకు సూచించింది.
మొదటి విడత కౌన్సెలింగ్
ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ మరియు సెంట్రల్ యూనివర్సిటీల కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 22లోగా సంబంధిత కళాశాలల్లో చేరాలి. రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 28లోగా అడ్మిషన్ పూర్తి చేసుకోవాలి.
రెండో విడత షెడ్యూల్
ఆల్ ఇండియా కోటా రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు నిర్వహిస్తారు. ఇందులో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 8లోగా కళాశాలల్లో చేరాలి. రాష్ట్ర కోటా రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగుతుంది. ఈ విడతలో ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ 15లోగా చేరాల్సి ఉంటుంది.
మూడో విడత కౌన్సెలింగ్
ఆల్ ఇండియా కోటా మూడో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు జరుగుతుంది. సీట్లు పొందిన వారు సెప్టెంబర్ 26లోగా అడ్మిషన్ పూర్తి చేయాలి. రాష్ట్ర కోటా మూడో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 16 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. ఈ రౌండ్లో చేరేందుకు అక్టోబర్ 1 చివరి తేదీగా నిర్ణయించారు.
స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎప్పట్నుంచంటే..?
మిగిలిన ఖాళీ సీట్ల భర్తీ కోసం ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహిస్తారు. రాష్ట్ర కోటాలో అక్టోబర్ 3 నుంచి 5 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రౌండ్లలో సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 10లోగా కళాశాలల్లో చేరాలి. ఎంసీసీ విడుదల చేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రాష్ట్ర కౌన్సెలింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల తరగతులు సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఎంసీసీ షెడ్యూల్ విడుదలైనప్పటికీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) ఇంకా వెలువడకపోవడంతో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రాష్ట్ర కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ చేయడంలో జాప్యం ఎదురవుతోంది. గత విద్యా సంవత్సరంలో సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించిన 175 ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుపై ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. అయితే అది ఒక్క ఏడాదికే పరిమితమవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి కొత్త జీవో అవసరమైంది. జీవో విడుదలైన వెంటనే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ విద్యా సంవత్సరంలో విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలకు అదనంగా 75 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించడంతో మొత్తం సీట్ల సంఖ్య 250కు చేరింది. ఈ సీట్లలో 15 శాతం అంటే సుమారు 38 సీట్లు ఆల్ ఇండియా కోటాకు కేటాయిస్తారు. మిగిలిన 212 సీట్లలో 15 శాతం అన్‌రిజర్వుడ్, 85 శాతం లోకల్ కోటా ప్రకారం భర్తీ చేస్తారు. లోకల్ కోటా సీట్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 65.62:34.38 నిష్పత్తి ప్రకారం ఆంధ్రా మరియు రాయలసీమ ప్రాంతాల విద్యార్థులకు కేటాయించనున్నారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎన్నారై కోటా ప్రవేశాలకు సంబంధించిన జీవో కూడా ప్రభుత్వం త్వరలో విడుదల చేయాల్సి ఉంది. జీవోలు వెలువడిన వెంటనే రాష్ట్ర కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.