
ఫ్రెండ్స్ లేని మనిషి ఉండడం అసాధ్యం. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ముందుగా గుర్తుకొచ్చేది స్నేహితులే. మనసులోని ఆనందాలు, సుఖదుఃఖాలు, రహస్య ఆలోచనలను కూడా ప్రాణ స్నేహితులతో ఎటువంటి డౌట్లు లేకుండా పంచుకుంటూ ఉంటాం. కానీ అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా.. ఫ్రెండ్స్‌తో మనసు విప్పి మాట్లాడటం మంచిదే అయినా, కొన్ని వ్యక్తిగత విషయాలను మాత్రం ఎంతటి ప్రాణ స్నేహితుడితోనైనా పంచుకోకపోవడమే మంచిదని మానసిక విశ్లేషకులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో మీ ప్రశాంతతను, బంధాలను కాపాడుకోవడానికి స్నేహితులకు కూడా చెప్పకూడని ఆ ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.
జీవిత భాగస్వామితో గొడవలు
చాలామంది తమ లైఫ్ పార్ట్‌నర్‌తో గొడవపడినప్పుడు, తీవ్రమైన బాధలో ఆ విషయాన్ని నేరుగా ప్రాణ స్నేహితులకు చెబుతుంటారు. కానీ ఇది ఎంతమాత్రం సరికాదు. మీ ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలు కొద్ది రోజుల్లో సర్దుమణుగవచ్చు. కానీ మీరు ఆవేశంలో భాగస్వామి గురించి చెప్పిన ప్రతికూల విషయాలు మీ స్నేహితుడి మనసులో నిండిపోయి, మీ భాగస్వామిపై లేదా మీ బంధంపై వారికి చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి దాంపత్య జీవితంలోని గొడవలను మీరే సొంతంగా పరిష్కరించుకోవడం మంచిది.
బ్యాంకింగ్ వివరాలు – పాస్‌వర్డ్‌లు
మీ ఫోన్ లాక్ పాస్‌వర్డ్, యూపీఐ పిన్, ఈమెయిల్ పాస్‌వర్డ్‌లు, ఎటిఎమ్ క్రెడిట్ కార్డ్ పిన్స్ లేదా ఇతర బ్యాంకింగ్ సమాచారాన్ని స్నేహితులతో ఎప్పుడూ పంచుకోవద్దు. మీ స్నేహితుడు ఎంత నమ్మకమైన వ్యక్తి అయినప్పటికీ, ఆర్థిక సంబంధిత డిజిటల్ భద్రతా వివరాలను ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచాలి. దీనితో పాటు ఇతరులు మీ వద్ద దాచిన రహస్యాలను కూడా మూడో వ్యక్తి అయిన మీ స్నేహితుడితో చెప్పడం మీ నమ్మకద్రోహానికి సంకేతంగా మారుతుంది.
భవిష్యత్ ప్రణాళికలు – లక్ష్యాలు
మీరు చేయబోయే కొత్త ఉద్యోగం, విదేశీ ప్రయాణాలు, వ్యాపార ప్రణాళికలు లేదా ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలను అవి పూర్తిగా కార్యరూపం దాల్చే వరకు ఎవరికీ చెప్పకపోవడమే మంచిది. ప్రణాళికలను ముందే బయటపెడితే, అవి ఎప్పుడు పూర్తవుతాయంటూ పదేపదే అడిగే ప్రశ్నలు మీపై అనవసరమైన మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఒకవేళ అనుకోకుండా ఆ ప్లాన్ విఫలమైతే నిరాశ చెందాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా మీ లక్ష్య సాధనపై దృష్టి పెట్టి, విజయం సాధించిన తర్వాతే పంచుకోండి.
మీ బలహీనతలు – భయాలు
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక విషయంలో భయం ఉంటాయి. సలహా లేదా మద్దతు కోరి మీ బలహీనతలను స్నేహితులకు చెప్పడం మంచిదే అనిపించవచ్చు. కానీ మీ లోపాలన్నింటినీ పూర్తిగా బయటపెట్టడం కొన్నిసార్లు మీకే ప్రతికూలంగా మారవచ్చు. అలాగే మీ కుటుంబ అంతర్గత విభేదాలను, సమస్యలను కూడా స్నేహితుల వద్ద ప్రస్తావించకండి. ఇటువంటి విషయాలు తెలిసిన తర్వాత, కొన్ని సందర్భాల్లో వారు మిమ్మల్ని తక్కువ చేసి చూసే అవకాశం ఉంది.
కాగా సాన్నిహిత్యం ఎంత ఉన్నా, కొంత మేర సెల్ఫ్ కంట్రోల్, గోప్యత పాటించడం వల్ల మీ వ్యక్తిగత జీవితం సురక్షితంగా ఉండటంతో పాటు మీ స్నేహబంధం కూడా ఎక్కువ కాలం నిలబడుతుంది.