Headlines

మనిషి ఆయుష్షుకు ప్రకృతి వేసిన డెడ్ లైన్ అదే.. ఎంత ట్రై చేసినా ఆ నెంబర్ దాటలేరు..

మనిషి ఆయుష్షుకు ప్రకృతి వేసిన డెడ్ లైన్ అదే.. ఎంత ట్రై చేసినా ఆ నెంబర్ దాటలేరు..


డిజిటల్ యుగంలో రోజుకో హెల్త్ టిప్, వెల్నెస్ హాక్ ఇస్తూ వందల ఏళ్లు బతకొచ్చు, అమరత్వం సాధించవచ్చు అని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, బయోహ్యాకర్లు చేస్తున్న ప్రచారాలపై అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నీళ్లు చల్లారు. మానవ జన్యు నిర్మాణంలో ఉన్న కొన్ని ప్రకృతిసిద్ధ పరిమితుల వల్ల మనిషి ఎంత ప్రయత్నించినా గరిష్ట ఆయుర్దాయం 146 నుంచి 190 ఏళ్ల మధ్య మాత్రమే ఉంటుందని ఒక అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ శాస్త్రీయ జర్నల్ ఎన్‌పీజే ఏజింగ్‌లో ప్రచురితమయ్యాయి.

మనిషిని ముసలివారిగా మార్చేది ఏంటి?

శాస్త్రీయ కోణంలో వృద్ధాప్యం అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. 2023లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం వృద్ధాప్యానికి ప్రధానంగా 12 రకాల సంకేతాలు కారణమవుతాయి.

  • కణాల విభజన సమయంలో జరిగే జన్యు పరివర్తనాలు.
  • ప్రొటీన్ల నిర్వహణలో లోపాలు.
  • మైటోకాండ్రియా పనితీరు దెబ్బతినడం.
  • డీఎన్ఏ చివర ఉండే టెలోమియర్లు క్షీణించడం.

సిద్ధాంతపరంగా టెలోమియర్ల క్షీణతను అడ్డుకుని ఆయుష్షును పెంచే అవకాశాలు ఉన్నప్పటికీ, ఆచరణలో వృద్ధాప్యాన్ని శాశ్వతంగా నివారించే చికిత్సలు ఇంకా అందుబాటులోకి రాలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఆయుష్షుకు అడ్డుకట్ట వేస్తున్న సోమాటిక్ మ్యూటేషన్లు

మన శరీరంలోని శోధక కణాలు మినహా మిగిలిన అన్ని కణాల్లో సంభవించే జన్యు మార్పులను సోమాటిక్ మ్యూటేషన్లు అంటారు. పొగతాగడం, అతినీలలోహిత కిరణాల ప్రభావం లేదా సహజ సిద్ధమైన కణ విభజన వల్ల ఇవి జరుగుతాయి. 80 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిలోని ఒక సాధారణ కణంలో వేల సంఖ్యలో ఈ సోమాటిక్ మ్యూటేషన్లు పేరుకుపోతాయి. ఒకసారి కణ జన్యువులో నష్టం జరిగితే దాన్ని సరిచేసే వ్యవస్థ మన శరీరంలో లేదు. దశాబ్దాల పాటు పేరుకుపోయే ఈ డ్యామేజ్ వల్ల కణాల పనితీరు దెబ్బతిని క్యాన్సర్, వృద్ధాప్యానికి దారితీస్తాయి. ప్రతీ కణజాలంలో ఇవి వేర్వేరుగా జరుగుతాయి కాబట్టి, వీటిని పూర్తిగా తొలగించడం వైద్యపరంగా అసాధ్యమని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెరెమీ క్లెర్క్ తెలిపారు.

అమరత్వం సాధ్యమేనా? లెక్కలు ఏం చెబుతున్నాయి?

అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒక అధునాతన గణిత నమూనా ద్వారా పరిశోధన చేపట్టింది. ఏజింగ్‌కు కారణమయ్యే మిగిలిన అన్ని అంశాలను పక్కన పెట్టి, కేవలం సోమాటిక్ మ్యూటేషన్లను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే.. మనిషి సగటు ఆయుష్షు 1,759 ఏళ్లు, గరిష్ట ఆయుష్షు 29,921 ఏళ్లుగా ఉంటుందని ప్రాథమికంగా భావించారు. అయితే వాస్తవ పరిస్థితుల్లో సోమాటిక్ మ్యూటేషన్ల ప్రభావం వల్ల శరీర కణాల క్షీణత తప్పదని, కాబట్టి ఏజింగ్ కారణాలన్నింటినీ అడ్డుకున్నప్పటికీ మనిషి గరిష్ట ఆయుర్దాయం 146 నుంచి 194 ఏళ్లకు మించదని సైంటిస్టులు కచ్చితంగా తేల్చి చెప్పారు.

గుండె, మెదడు కణాలే లైఫ్‌స్పాన్ బాటిల్‌నెక్స్

శరీరంలోని కాలేయ కణాలు సోమాటిక్ మ్యూటేషన్లను తట్టుకుని దాదాపు లక్ష సంవత్సరాలైనా పునరుత్పత్తి కాగలవని ఈ అధ్యయనం తెలిపింది. కానీ గుండె గోడలలోని కణాలు, మెదడులోని నరాల కణాలు మాత్రం ఈ మ్యూటేషన్లకు త్వరగా లొంగిపోతాయి. ఈ కణాలు ఒకసారి తయారయ్యాక మళ్లీ విభజన చెందవు. కాబట్టి ఇవి దెబ్బతింటే గుండె, మెదడు పనితీరు ఆగిపోయి మరణం సంభవిస్తుంది. దీన్నే శాస్త్రవేత్తలు లైఫ్‌స్పాన్ బాటిల్‌నెక్స్ అని పిలుస్తున్నారు. భవిష్యత్తులో మానవ ఆయుష్షును పెంచాలంటే ప్రధానంగా గుండె, మెదడు కణాల క్షీణతను అడ్డుకోవడంపైనే పరిశోధనలు జరగాలని ఇది స్పష్టం చేస్తోంది.

దీర్ఘాయుష్షు కోసం పాటించాల్సిన బేసిక్ సూత్రాలు..

అమరత్వపు ప్రయోగాలు, హైటెక్ మందులను పక్కన పెడితే.. సహజంగానే మరో 10 నుంచి 20 ఏళ్ల ఆయుష్షును పెంచుకోవడానికి పాతకాలపు ప్రాథమిక సూత్రాలే మంచివని రీజనరేటివ్ మెడిసిన్ నిపుణురాలు డాక్టర్ ఎగ్లే పవిడే సూచిస్తున్నారు.

ధూమపానానికి స్వస్తి: పొగతాగే అలవాటుకు పూర్తిగా దూరంగా ఉండాలి.

క్రమశిక్షణతో వ్యాయామం: రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం తప్పనిసరి.

పౌష్టికాహారం: ప్రాసెస్ చేయని మంచి పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

గాఢమైన నిద్ర: శరీరానికి తగినంత, నాణ్యమైన నిద్ర చాలా అవసరం.

మంచి అనుబంధాలు: మానసిక ఒత్తిడిని తగ్గించుకుని, సమాజంలో మనుషులతో మంచి సంబంధాలు కొనసాగించాలి.

శాస్త్రవేత్తల ప్రయోగాల కంటే ఈ ప్రాథమిక జీవనశైలి నియమాలను క్రమం తప్పకుండా పాటించడమే మన ఆరోగ్యాన్ని, ఆయుష్షును కాపాడే అతిపెద్ద ఆయుధమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *