భారత అంతరిక్ష చరిత్రలో ప్రైవేటు రంగానికి కొత్త అధ్యాయాన్ని లిఖించిన విక్రమ్-1 ఆర్బిటల్ ప్రయోగ వాహకం విజయవంతమైన ప్రయోగంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముగ్గురు యువ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజనీర్లు ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగంలో భాగస్వాములు కావడం విశేషం.
సిరిసిల్ల పట్టణానికి చెందిన సోదరులు అడుప సంతోష్ కుమార్, అడుప కిరణ్, అలాగే వారి కుటుంబానికి చెందిన బొమ్మదేని నాగరాజు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన తొలి ఆర్బిటల్ ప్రయోగ వాహకం విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగంలో తమ సాంకేతిక నైపుణ్యాన్ని చాటుకున్నారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1 తన తొలి ప్రయోగంలోనే ఉపగ్రహాలను దిగువ భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి భారత ప్రైవేటు అంతరిక్ష రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. ఈ చారిత్రాత్మక విజయానికి సిరిసిల్ల యువత కూడా భాగస్వాములు కావడం జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
ప్రయోగంలో అడుప సంతోష్ కుమార్ అవియానిక్స్ చెక్‌అవుట్ లీడ్గా రాకెట్ అవియానిక్స్ వ్యవస్థల తనిఖీలు, పరీక్షలు, ప్రయోగానికి ముందు నిర్వహించే కీలక గ్రౌండ్ చెక్‌అవుట్ కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. అడుప కిరణ్ రాకెట్ క్యాడ్ డిజైనర్గా రాకెట్ రూపకల్పనకు సంబంధించిన డిజైన్ పనుల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. బొమ్మదేని నాగరాజు ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ విభాగంలో రాకెట్ విద్యుత్ వ్యవస్థల సమీకరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు.
ఒకే ఊరు, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజనీర్లు భారత అంతరిక్ష విజయగాథలో భాగస్వాములు కావడం సిరిసిల్ల ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపింది. స్థానికులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, యువత ఈ ముగ్గురు ఇంజనీర్లను అభినందిస్తూ వారి విజయం సిరిసిల్ల యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..