Headlines

భారత్‌ ముందు అతిపెద్ద గండం.. వాతావరణంలో ఊహించని మార్పులు

భారత్‌ ముందు అతిపెద్ద గండం.. వాతావరణంలో ఊహించని మార్పులు


రానున్న రోజుల్లో భారత్‌ను తీవ్రమైన ఎండలు, తక్కువ వర్షపాతం పట్టిపీడించనున్నాయా? అంటే అవుననే హెచ్చరిస్తుంది ప్రపంచ వాతావరణ సంస్థ. పసిఫిక్ మహాసముద్రంలో పవర్‌ఫుల్‌గా మారుతున్న ఎల్ నినో ప్రభావం వల్ల భారత్‌లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సంచలన అప్‌డేట్ ఇచ్చింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఈ విధ్వంసకర వాతావరణ పరిస్థితులు తలెత్తనున్నాయని స్పష్టం చేసింది.

ఆగస్టు-అక్టోబర్‌పై ఎల్ నినో ఎఫెక్ట్

WMO తాజా నివేదిక ప్రకారం.. ఆగస్టు నుండి అక్టోబర్ 2026 మధ్యకాలంలో ఎల్ నినో అత్యంత తీవ్ర రూపం దాల్చనుంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.9 డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉండటమే దీనికి ప్రధాన కారణం. దక్షిణ ఆసియా ముఖ్యంగా భారత ఉపఖండంలో ఈ కాలంలో వర్షపాతం బాగా తగ్గిపోనుంది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదు కావడం వల్ల తాగునీటి సరఫరా, వ్యవసాయ రంగాలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ‘‘ఎల్ నినో కేవలం తలుపు తట్టడం లేదు.. నేరుగా ఇంట్లోకి వచ్చేసి మంటలు పెంచుతోంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, రాబోయే రోజుల్లో మానవాళి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత భయానకంగా మారనుంది’’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు.

అసలు ఈ మార్పుకు కారణమేంటి?

పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కడమే ఎల్ నినో. ఇది గాలి వీచే దిశలను, వర్షపాతాన్ని, ప్రపంచ ఉష్ణోగ్రతలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనికి తోడు ఇండియన్ ఓషన్ డిపోల్ కూడా పాజిటివ్‌గా మారే అవకాశం ఉంది. అంటే పశ్చిమ హిందూ మహాసముద్రం వేడెక్కి, తూర్పు వైపు చల్లబడుతుంది. ఎల్ నినో, పాజిటివ్ ఐఓడీ రెండూ ఒకేసారి వస్తే హిందూ మహాసముద్ర పరివాహక ప్రాంతాల్లో తీవ్ర కరువులు లేదా అనూహ్య వరదలు వచ్చే ప్రమాదం ఉంది.

ముందస్తు చర్యలే శరణ్యం

సాధారణంగా ఎల్ నినో ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. ఇది దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది. వాతావరణ సమాచారాన్ని కేవలం వినడమే కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యం అని WMO సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో తెలిపారు. ‘‘వాతావరణ మార్పుల నుంచి ఉపద్రవాలను నివారించాల్సింది మనుషులే. ప్రభుత్వాలు, ప్రజలు ఇప్పుడే తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి” అని ఆమె సూచించారు. ఎల్ నినో తెచ్చే విపత్తులను తట్టుకునేందుకు వాతావరణ శాఖలు ఎప్పటికప్పుడు అప్‌డేట్లను ఇస్తూ, ప్రభుత్వాలను అలర్ట్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *