Headlines

సనత్‌నగర్ టిమ్స్‌కు ఆ మాజీ CM పేరు.. ఇన్‌చార్జి డైరెక్టర్‌ ఎవరంటే..?

సనత్‌నగర్ టిమ్స్‌కు ఆ మాజీ CM పేరు.. ఇన్‌చార్జి డైరెక్టర్‌ ఎవరంటే..?


హైదరాబాద్‌, జులై 31: రాష్ట్రంలో వైద్య విద్య, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సనత్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టింది. అదే సంస్థకు ఇన్‌చార్జి డైరెక్టర్‌గా, ప్రస్తుత మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్‌ను నియమించింది. డీఎంఈగా డాక్టర్ వాణిని నియమించింది. ఈ మూడు నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వం వేర్వేరుగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరుతో టిమ్స్

తెలంగాణ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సేవలకు గుర్తింపుగా సనత్‌నగర్ టిమ్స్‌కు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఈ హాస్పిటల్‌ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.63 జారీ చేసింది. ప్రస్తుతం డీఎంఈగా ఉన్న డాక్టర్ ఎ. నరేంద్ర కుమార్ జూలై 31న ఉద్యోగా విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన సుదీర్ఘ పరిపాలనా అనుభవాన్ని సనత్‌నగర్ టిమ్స్‌కు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా నియమిస్తూ జీవో ఎంఎస్ నం.64 జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న అడిషనల్ డీఎంఈ డాక్టర్ ఎన్.వాణిని మెడికల్ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జీవో ఆర్టీ నం.318 జారీ చేసింది. వాణికి గతంలోనూ డీఎంఈగా కొంతకాలం పనిచేసిన అనుభవం ఉంది.

జాతీయ నాయకుడు, తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు అందించిన సేవలు చిరస్మరణీయం అని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఒక వైద్యునిగా, రాజకీయ నాయకునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గవర్నర్‌‌గా ఆయన జీవితాంతం ప్రజల కోసం పనిచేశారని మంత్రి కొనియాడారు. సనత్‌నగర్ ఎమ్మెల్యేగా ఆయన పనిచేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి పేరును సనత్‌నగర్ టిమ్స్‌కు పెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన స్పూర్తితో సనత్‌నగర్‌‌ టిమ్స్‌లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల అభివృద్ధికి, వైద్య విద్యలో నాణ్యత పెంచేందుకు డీఎంఈగా డాక్టర్ నరేంద్ర కుమార్ చేసిన సేవలను అభినందనీయం అని మంత్రి పేర్కొన్నారు. ఆయనకున్న సుదీర్ఘ అనుభవాన్ని సనత్‌నగర్ టిమ్స్ నిర్మాణాత్మక దశలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించామని మంత్రి వెల్లడించారు.

టిమ్స్‌ను అత్యున్నత ప్రమాణాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్ది, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం అని మంత్రి తెలిపారు. డీఎంఈగా పదోన్నతి పొందిన డాక్టర్ ఎన్. వాణికి మంత్రి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లను మరింత బలోపేతం చేయడం, వైద్య విద్యలో ప్రమాణాలను పెంచడం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడడంలో డీఎంఈ పాత్ర అత్యంత కీలకం అని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చేపడుతున్న కార్యక్రమాలను డాక్టర్ వాణి తన అనుభవంతో మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *