Headlines

ఘోర విషాదం.. బొగ్గు గనిలో భయంకర పేలుడు.. 32 మంది మైనర్లు సజీవ సమాధి.. !

ఘోర విషాదం.. బొగ్గు గనిలో భయంకర పేలుడు.. 32 మంది మైనర్లు సజీవ సమాధి.. !


పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. క్వెట్టా సమీపంలోని సోరేంజ్ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32 మంది గని కార్మికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 29 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మరో మూడు మృతదేహాలను గుర్తించి బయటకు తీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

గని లోపల మీథేన్ వాయువు అధికంగా పేరుకుపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారుల ప్రాథమిక అంచనా వేస్తున్నారు. పేలుడు తీవ్రతకు ఒకదానికొకటి సమీపంలో ఉన్న రెండు గనులు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో మొత్తం 36 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. పేలుడు జరిగిన వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు, గనుల శాఖ అధికారులు, స్థానిక సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదం జరిగిన 12 గంటలు దాటిన తర్వాత కూడా శిథిలాల కింద చిక్కుకున్నవారిని ప్రాణాలతో రక్షించే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో బొగ్గు గనుల్లో ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అనేక గనుల్లో సరైన వెంటిలేషన్ వ్యవస్థ, గ్యాస్ పర్యవేక్షణ పరికరాలు, భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. గనుల యజమానులు భద్రతా నిబంధనలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయినప్పటికీ తీవ్ర పేదరికం, నిరుద్యోగం కారణంగా బలూచిస్తాన్‌లో వేలాది కుటుంబాలు బొగ్గు గనులపైనే జీవనోపాధి కోసం ఆధారపడుతున్నాయి. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో మైనర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ తాజా ఘటన మరోసారి గనుల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *